సచ్చరిత్ర పారాయణము లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
సచ్చరిత్ర పారాయణము లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

6, జనవరి 2011, గురువారం

ఆంగ్లం లో సాయి సచ్చరిత్ర సారాంశము

 ప్రియమైన సాయి భక్తులకు,

      ఇదివరకు శ్రీ సూర్య ప్రకాశ రావు గారు రచించిన "శ్రీ సాయి సచ్చరిత్ర సారాంశము" ను నా బ్లాగు ద్వారా ప్రచురించే భాగ్యం కలిగింది. తదుపరి పలువురు సాయి భక్తులు ఈ అమూల్య రచనను ఆంగ్లము లోనికి అనువదించ వలసినదిగా కోరడం జరిగింది. వారి ప్రోత్సాహంతో, సాయి కృపతో ఈ చిన్న రచనను ఆంగ్లం లోకి అనువదించడం జరిగింది. ఇదంతా సాయి ఆశీస్సులుగా భావిస్తున్నాను.  

      ఈ ఆంగ్ల అనువాదం దిగువన యివ్వ బడిన web site లో post చేయబడింది. 
http://shiridisaisv.blogspot.com/
దయచేసి సాయి భక్తులైన మీ మిత్రులకు, బంధువులకు ఈ వివరము తెలియజేయగలరు. అంతే కాకుండా ఈ Web site ను ఈ page లోని "నా బ్లాగులు" క్రింద గల "Shirdi Sai" ను click చేసిన యెడల కూడా English Blog కు పోగలరు.

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయి నాథ్ మహారాజ్ కి జై!

30, డిసెంబర్ 2010, గురువారం

శ్రీ సాయి సచ్చరిత్ర సారాంశము - తుది పలుకు


శ్రీ సాయి సచ్చరిత్ర సారాంశము  
(నిత్య పారాయణ గ్రంథము) 
తుది పలుకు
      శ్రీ హేమాద్ పంత్ చే రచించబడి, షిరిడీ సంస్థానము వారిచే ముద్రించబడిన "శ్రీ సాయి సచ్చరిత్రము" నుండి బాబా గారి సందేశమును అందరికీ సులభముగా పారాయణ చేయుటకు వీలుగా "శ్రీ సాయి సచ్చరిత్ర సారాంశము" అను పేరన ఒక అమూల్యమైన చిరు రచనగా క్లుప్తీకరించి, గురు పూర్ణిమ (జూలై 25, 2010) శుభ దినాన పలువురు సాయి భక్తులకు వినిపించి, ఆనందింప జేసి, తదుపరి ఈ రచనను అందరు సాయి భక్తులకు అందించాలనే సత్సంకల్పం తో దీనిని ముద్రించుటకు నన్ను ప్రోత్సహించి, మా స్వగృహం లో దీనిని పలువురు సాయి భక్తుల సమక్షంలో ఆవిష్కరించి, ఈ రచనను నా "సాయి వాణి" బ్లాగు ద్వారా నలుగురికీ అందింపజేసి,  శ్రీ సాయి సేవలో పాలు పంచుకొనే భాగ్యం నాకు కలిగించిన పూజ్యులు, పితృ తుల్యులు, విశాఖ పట్నం వాస్తవ్యులు  బ్రహ్మశ్రీ చుండూరి సూర్య ప్రకాశరావు గారికి 
హృదయ పూర్వక నమస్సుమాంజలులతో,

సాయి భక్తుడు 
సూర్యనారాయణ వులిమిరి,
మోరిస్ విల్, నార్త్ కరోలినా, USA.
ఆగస్ట్ 15, 2010.

Author's Permanent Address:
Ch.K.Surya Prakasa Rao
G-4 Madhuri Mansion Apts.
Narasimha Nagar
Visakhapatnam-24
Andhra Pradesh, INDIA.
Ph: (L) (0891) 2726086; (M): 9848878236

Camp:
Gayatri-Sambasiva Rao Nanduri
104 Ruthwin Dr.
Morrisville, NC 27560 USA
(M): 1-919-455-6541
E-mail: nanduri_rao@yahoo.com

Book Formatting/Web Publishing:
Suryanarayana V. Vulimiri
202 Elshur Way
Morrisville, NC 27560 USA
(M): 1-919-612-6437
E-mail: suryvulimiri@gmail.com
URL: http://www.saivanisv.blogspot.com
___________________________________________________________________
వెల: అమూల్యము 
ఉచిత ప్రతులకు పై వారిని సంప్రదించండి.
మొదటి ముద్రణ: 350 ప్రతులు, ఆగస్టు 2010, North Carolina, USA.
___________________________________________________________________

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై !

29, డిసెంబర్ 2010, బుధవారం

శ్రీ సాయి సచ్చరిత్ర సారాంశము - బుధవారము పారాయణము


శ్రీ సాయి సచ్చరిత్ర సారాంశము  
(బుధ వారము పారాయణము) 
మూలము: శ్రీ హేమాదు పంత్ చే రచింపబడి షిరిడీ సంస్థానము వారిచే ముద్రింపబడిన శ్రీ సాయి సచ్చరిత్రము నుండి.
క్లుప్తీకరణ: సి.హెచ్.కె.సూర్య ప్రకాశ రావు 
సాయి భక్తుడు 


45వ అధ్యాయము:

          బాబా మన దృష్టినుండి మరణించెను. కాని వారి యనంత శక్తి లేదా సాయి స్వరూపము ఎల్లప్పుడునూ నిలిచియే యుండును. అప్పుడే కాదు యిప్పుడు కూడ కావలసినది బాబాయందు హృదయపూర్వకమైన భక్తి. మన బుద్ధి, యింద్రియములు, మనస్సు బాబా సేవలోనైక్యము కావలయును. జీవిత పరమావధిని పొందుటకు తండ్రిగాని, తల్లిగాని, సోదరులు గాని, బంధువులు గాని తోడ్పడరు. ఆత్మ సాక్షాత్కారమునకు దారిని మనమే వెదుకుకొని ప్రయాణము సాగించవలయును. కలియుగములో మోక్షము పొందుటకు ఒక్కటే మార్గము కలదు. అదే మన గురుని లేదా హరి పాదారవిందములను స్మరించుట. గురు స్మరణ మనకు శాశ్వత ఆనందమును కలుగజేయును. "మంచిగాని, చెడ్డగాని ఏది మనదో అది మన దగ్గర యున్నది. ఏది యితరులదో అది యితరుల వద్ద ఉన్నది" అని బాబా మహల్సాపతితో అనెను.

46వ అధ్యాయము:

          ప్రస్తుతము బాబా రూపము అగోచరమైనప్పటికి భక్తులు బాబాయందే నమ్మకముంచినచో వారు సమాధి చెందకముందు చేసిన లీలలను అనుభవించెదరు. బాబా భక్తుని ఎవరినైననూ ఆమోదించినచో రాత్రింబవళ్ళు భక్తుని చెంతనే యుండి, యింటివద్దనుగాని, దూరదేశమునగాని బాబా వెంబడించుచుండును. భక్తుడు తన యిష్టము వచ్చినచోటుకు పోయినయెడల బాబా అచ్చటకు భక్తునికంటె ముందుగా బోయి ఏదో ఒక ఊహించరాని రూపమున ఉండును. రెండు మేకల కథను బట్టి బాబాకు జంతువులపైన కూడ అపారమైన ప్రేమయని తెలియుచున్నది.

47వ అధ్యాయము:

          శ్రీ సాయి ముఖము పావనమైనది. ఒక్కసారి వారివైపు దృష్టి నిగిడించినచో ఎన్నో జన్మల విచారమును నశింపజేసి ఎంతో పుణ్యములను ప్రాప్తించునటులజేయును. వారి దయాదృష్టి మనపై బరపినచో మన కర్మ బంధములు వెంటనే విడిపోయి మనమానందము పొందెదము. గత జన్మలో చేసినదాని ఫలము ఈ జన్మలో అనుభవించి తీరవలయును. దానిని గూర్చి దుఃఖించినచో ప్రయోజనము లేదు. భగవంతుడు ఆపద సమయమందు భక్తుల రక్షించుటకై వారి వద్దకు పరుగెత్తును. దీనికి సంబంధించిన కథ వీరభద్రప్ప-చెన్న బసవప్ప (పాము-కప్ప కథ)

నీతి: ఈ కథవలన మనము నేర్చుకొనిన నీతి యేమనగా ఎవరు చేసిన దానిని వారే అనుభవించవలయును. ఇతరులతో గల సంబంధములు బాధలను కూడ అనుభవింపజేయును. తప్పించుకొను సాధనము లేదు. తనకెవరితోనైన శతృత్వమున్న దాని నుండి విముక్తి పొందవలెను. ఎవరికైన ఏమైన బాకీయున్న తీర్చివేయవలయును. ఋణముగాని, శతృత్వ శేషముగాని యున్నచో తగిన బాధపడవలయును. ధనమునందు పేరాశ గలవానికి అది హీనస్థికి తెచ్చును. తుట్టతుదకు వానికి నాశనము కల్గజేయును.

48వ అధ్యాయము:

సద్గురుని లక్షణములు:

          ఎవరైతే చక్కని సంభాషణల వలన మనకు యిహపర సుఖములందు విరక్తి కలుగజేసెదరో; ఎవరు ఆత్మ సాక్షాత్కారమునందు మనకు అభిరుచి కల్గునట్లు జేసెదరో; ఎవరైతే ఆత్మ సాక్షాత్కార విషయమున పుస్తక జ్ఞానమేగాక, ఆచరణయందు అనుభవము కూడ పొందియున్నారో అట్టివారు సద్గురువులు.
సద్గురుని ముఖ్య లక్షణము: వారు శాంతమునకు ఉనికిపట్టు. వారు ఎప్పుడు చాపల్యముగాని, చికాకుగాని చెందరు. తమ పాండిత్యమునకు వారు గర్వించరు. ధనవంతులు, పేదలు, ఘనులు, నీచులు వారికి సమానమే. అటువంటి సద్గురువు శ్రీ షిరిడీ సాయిబాబా.

          అందుచే భక్తులు చేయవలసిన పని భక్తి-విశ్వాసము లనెడి హృదయదీపమును సరిచేయవలయును. ప్రేమ అను వత్తిని వెలిగించవలయును. ఎప్పుడిట్లు చేసెదరో అప్పుడు జ్ఞానమనే జ్యోతి (ఆత్మ సాక్షాత్కారము) వెలిగి ఎక్కువ తేజస్సుతో ప్రకాశించును. యదార్థమైన కాంక్ష, ఉత్తమమైన భావములు ఉన్నచోటనే భగవంతుడు తానై సాక్షాత్కరించును. అదియే ప్రేమ. అదే మోక్షమునకు మార్గము.

          శ్రీ సాయిబాబా భౌతిక శరీరముతో ఉన్నప్పుడు తమ భక్తులకు ఏ అనుభవములు యిచ్చుచుండిరో, అటువంటి అనుభవములు యిప్పుడు కూడ సంపూర్ణ విశ్వాసము గల భక్తులు అనుభవించుచున్నారు.

49వ అధ్యాయము:

          తీర్థయాత్ర, వ్రతము, త్యాగము, దానముల కంటె తపస్సు చేయుట గొప్ప. హరిని పూజించుట తపస్సుకంటె మేలు. సద్గురుని ధ్యానించుట అన్నిటికంటె మేలయినది. మన కర్తవ్యమును మనము చేయగల్గినచో సాయి సద్గురువు తప్పనిసరిగా మనకు సహాయము చేయును. తుదకు మోక్షమునిచ్చును. బాబా గారు ఒకసారి నానాతో, అనవసరముగా చికాకు పడుచుంటివేల. ఇంద్రియములను వాటి పనులను చేయనిమ్ము. వానితో మనము జోక్యము కలుగజేసికొన కూడదు. దేవుడు ఈ సుందరమైన ప్రపంచమును సృష్టించియున్నాడు. అందరిని చూసి సంతసించుట మన విధి. మన హృదయము స్వఛ్చముగా యున్నంతవరకు ఏమియు దోషములేదు. మనలో చెడ్డ ఆలోచనలు లేనప్పుడు యితరులకు భయపడనేల. నేత్రములు వాని పని అవి నెరవేర్చుకొనవచ్చును. నీవు సిగ్గుపడి బెదరనేల. "బాహ్యేంద్రియములనే స్వాధీనమునందుంచుకొని మనస్సును విషయముల వైపు పరుగిడ నిచ్చినచో వానిపై అభిమానము ఉండనిచ్చినచో చావు-పుట్టుకల చక్రము నశింపదు".

50వ అధ్యాయము:

          సాయిబాబా కథలు మనకు ఊరటను, సుఖశాంతులను కలుగజేయును. సాయి కథలు చెప్పువారును, వినువారును ధన్యులు, పావనులు. చెప్పువారి నోరును, వినువారి చెవులును పవిత్రములు. బాబా భక్తులతో మంచిగాని, చెడ్డగాని చేయుటకు నీవు కర్తవని అనుకొనరాదు. గర్వ, అహంకార రహితుడవై యుండవలయును. అంత్య కాలమున నిన్ను విమానములో తీసుకొని పోయెదను. భక్తుడు తనవాడు కానిచో తనచే ఆకర్షించబడడనియు, వాడు తన దర్శనమే చేయలేడనియు చెప్పుచుండెను.

51వ అధ్యాయము: (శ్రీ సాయి సచ్చరిత్ర లోని 52, 53 అధ్యాయము లిందు 51 వ అధ్యాయముగా పరిగణించ వలెను)

ఇవియే చివరి అధ్యాయములు. హేమాద్‍పంత్ ఉపసంహార వాక్యములు. సద్గురు సాయి యొక్క గొప్పదనము. శ్రీసాయి సమర్థునికి సాష్టాంగ నమస్కారముజేసి వారి ఆశ్రయమును పొందెదరు. వారు జీవ, జంతువులయందును, జీవములేని వస్తువులయందును వ్యాపించియున్నారు. వారినే జ్ఞప్తియందుంచుకొని, వారిని శరణు పొందినచో వారు మన కోరికలనన్నిటిని నెరవేర్చి మనము జీవిత పరమావధిని పొందునట్లు చేసెదరు. ఈ సంసారమనే మహాసముద్రమును దాటుట మహా కష్టము. ఈ మహాసముద్రమును దాటుటకు సద్గురువు సాయి నావ వంటివారు. వారు మనలను సురక్షిరముగా దాటించెదరు.

శ్రీసాయినాథుని ఏకాదశ సూత్రములు:

1.  శిరిడి ప్రవేశమే సర్వ దుఃఖ పరిహారము.
2.  ఆర్తులైననేమి, నిరుపేదలైననేమి ద్వారకామాయి ప్రవేశమొనరించినంతనే సుఖసంపదలందగలరు.
3.  ఈ భౌతిక దేహానంతరము సైతము నేను అప్రమత్తుడనే.
4.  నా భక్తులకు రక్షణము నా సమాధినుండియే వెలువడును.
5.  సమాధి నుండియే సర్వకార్యములు నిర్వహింతును.
6.  సమాధి నుండి నా మానుష శరీరము మాట్లాడును.
7.  నన్ను ఆశ్రయించు వానిని, శరణుజొచ్చిన వానిని నిరంతరము రక్షించుటయే నా కర్తవ్యము.
8.  నాయందు ఎవరికి దృష్టి కలదో వారియందే నా కటాక్షము.
9.  మీ భారములను నాపై బడవేయుడు. నేను మోసెదను.
10. నా సహాయముగాని, సలహానుగాని కోరిన తక్షణమే యొసంగెదను.
11. నా భక్తుల గృహములందు లేమి అను శబ్దము పొడసూపదు.

ఫలశృతి:

          ఈ గ్రంథమును పారాయణ చేసినచో గల్గు ఫలితమును గూర్చి కొంచెము చెప్పుదుము. జనన మరణములనే చక్రము నుండి తప్పించుకొనవలెనన్నచో సాయి కథలను చదువుము. దాని నెల్లప్పుడును జ్ఞప్తి యందుంచుకొనుము. వారి పాదములనే ఆశ్రయించుము. వానినే భక్తితో పూజించుము.

          శ్రీసాయి సగుణ స్వరూపమునే ధ్యానించినచో క్రమముగా అది నిష్క్రమించి ఆత్మ సాక్షాత్కారమునకు దారి చూపును. భక్తుడు బాబాను సర్వస్య శరణాగతి వేడినచో అతడు తాను అను దానిని మరచిపోయి, నది సముద్రములో కలియునట్లు భగవంతునిలో ఐక్యమగును.

          స్నానము చేసిన పిమ్మట ఎవరు దీనిని భక్తి, ప్రేమలతోను, పూర్తి నమ్మకముతోను పారాయణ చేసి వారము రోజులలో ముగింతురో వారి ఆపదలన్నియు నశించగలవు. కేంద్రీకరించిన మనస్సుతో ప్రతిరోజు ఒక అధ్యాయము పారాయణము చేసినచో అదియు అపరిమితానందమును కలుగజేయును. నీ హృదయమునందు శ్రీ సాయి చరణములనే నమ్మినయెడల భవసాగరమును సులభముగా దాటగలవు. వారి వారి భక్తి, నమ్మకములపై ఫలమాధారపడి యున్నది.

ప్రసాద యాచనము:

          ఈ గ్రంథమును సర్వ శక్తిమయుడైన భగవంతుని ప్రార్థనతో ముగించెదము. కారుణ్యము జూపుమని వారిని వేడెదము. ఈ గ్రంథమును చదువు భక్తులు హృదయ పూర్వకమగు సంపూర్ణ భక్తి శ్రీ సాయి పాదములందు పొందెదరుగాక. సాయి సగుణ స్వరూపము వారి నేత్రములందు నిలిచిపోవును గాక! వారు శ్రీ సాయిని సర్వ జీవములందు చూచెదరుగాక! తథాస్తు!

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కి జై!

శ్రీ సాయి సచ్చరిత్ర సారాంశము సర్వము సంపూర్ణము.
శ్రీ సాయి కటాక్షము చేత వ్రాయుట సిద్ధించినది.
తల్లిదండ్రులకు అంకితము. నేను నిమిత్త మాత్రుడను

సాయి భక్తుడు
సి.హెచ్.కె.సూర్యప్రకాశ రావు
విశాఖపట్నం
కేంప్: యుఎస్‍ఎ, నార్త్ కరోలినా స్టేట్, మోరిస్‍విల్, తేదీ. 25 జూలై 2010.

28, డిసెంబర్ 2010, మంగళవారం

శ్రీ సాయి సచ్చరిత్ర సారాంశము - మంగళవారము పారాయణము


శ్రీ సాయి సచ్చరిత్ర సారాంశము  
(మంగళ వారము పారాయణము) 
మూలము: శ్రీ హేమాదు పంత్ చే రచింపబడి షిరిడీ సంస్థానము వారిచే ముద్రింపబడిన శ్రీ సాయి సచ్చరిత్రము నుండి.
క్లుప్తీకరణ: సి.హెచ్.కె.సూర్య ప్రకాశ రావు 
సాయి భక్తుడు 


38వ అధ్యాయము:

      శ్రీసాయి సద్గురువు. పావనమూర్తి. శరణుజొచ్చిన వారిని పోషించి రక్షించెదరు. బాబా స్వయముగా తన చేతులతో వంటచేసి ఎవరు శాఖాహారులో వారికి శాఖాహారము, ఎవరు మాంసాహారులో వారికి మాంసాహారమును పెట్టువారు. బాబాగారు అన్నము వండునపుడు చేయిపెట్టి కలుపుచుండెడివారు. అయినను చేయి కాలునది కాదు. కృతయుగములో తపస్సు, త్రేతా యుగములో జ్ఞానము, ద్వాపర యుగములో యజ్ఞము, కలియుగములో దానము, భగవన్నామస్మరణ చేయవలెనని శాస్త్రములు ఘోషించుచున్నవి. దానములన్నింటిలో అన్నదానమే శ్రేష్టమైనది. ఆహారమే పరబ్రహ్మ స్వరూపము.

      బాబా దేవాలయములను, దేవతలను ఏమాత్రము అగౌరవపరచినను ఊరుకొనెడివారు కాదు. షిరిడీ గ్రామములోని హిందూ దేవాలయములన్నిటిని మరమ్మత్తు చేయించుచుండిరి. బాబాను కొందరు హిందువులని, కొందరు మహమ్మదీయులని భావించుచుండెడివారు. నిజముగా బాబా ఏ జాతికి, మతమునకు చెందినవారు కాదు. వారు ఎప్పుడు పుట్టితిరో, వారి తల్లిదండ్రులెవరో ఎవరికి తెలియదు.

కాలా (మిశ్రమము):

      భక్తులు తెచ్చిన ప్రసాదములన్నియు ఒక్క పాత్రలో వేసి బాబాకు సమర్పించి తదుపరి భక్తులు ప్రసాదముగా స్వీకరించుచుండిరి.

      బాబాగారు తాను త్వరలో సమాధి చెందుదురని తెలిసికొని హేమాద్‍పంతుకు ఒక గిన్నెడు మజ్జిగ యిచ్చి త్రాగించెను. దీనిని బట్టి బాబా సర్వజ్ఞుడని తెలియుచున్నది. చదువరులతో హేమాద్ పంతునకు మనము నిజముగా నమస్కరించవలెను. అతడు గిన్నెడు మజ్జిగ ప్రసాదముగా త్రాగి, మనకు కావలసినంత అమృతమును బాబా లీలలు రూపముగా నిచ్చెను. మనము ఈ అమృతమును గిన్నెలతో త్రాగి సంతుష్టిచెంది ఆనందించెదము గాక.

39వ అధ్యాయము:

      షిరిడీ వలె ద్వారకామాయి పావనమైనది. ఏలనన సాయి అచట నివసించును. తిరుగుచు, మసలుచు అక్కడనే మహాసమాధి పొందిరి. బాబా తనకు సంస్కృతము తెలియదని భావించిన నానా అను భక్తునకు గర్వము అణుచుటకు భగవద్గీత 4వ అధ్యాయము, 34వ శ్లోకము "తద్విద్ధి ప్రణిపాతేన, పరిప్రశ్నేన సేవయా, ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వ దర్శినః" అన్న శ్లోకమునకు అర్థము సవివరముగా తెలియజేసెను.

      సేవయనగా యిష్టమున్నచో చేయవచ్చును, లేనిచో మానవచ్చును అనే అభిప్రాయముతో చేయునది సేవకాదు. శరీరము తనది కాదనియు, దానికి తాము యజమాని కాదనియు, శరీరము గురువుగారిది అనియు, వారి కొరకే సేవచేయుటకు శరీరమున్నదనియు భావింపవలెను. ఇక్కడ గురువుగారు అంటే భగవంతుడు అని భావము. సద్భక్తుడు సర్వస్వమును వాసుదేవమయముగా భావించును.

సమాధి మందిర నిర్మాణము:

      బాబా తాను చేయ నిశ్చయించిన పనులను గూర్చి ఎప్పుడును ముందుగా మాట్లాడువారు కాదు. కోటీశ్వరుడగు శ్రీమాన్ బాపూసాహెబ్ బూటీ మరియు భక్తుడగు శ్యామా కలసి షిరిడీలో విశాలమైన మందిరమును నిర్మించి మురళీధరుని విగ్రహమును ప్రతిష్ట చేయవలెనని తలంచి ఈ విషయము బాబాగారికి తెలియజేయగా, సర్వాంతర్యామియైన బాబా "దేవాలయము పూర్తి కాగానే నేనే అచ్చట నివసించుటకు వచ్చెదను" అని చెప్పెను. పూర్తి అయిన తర్వాత మనమే దానిని ఉపయోగించుకొనవలయుని అనిరి. బాబావారి జీవితలోతును కనుగొన శక్యము ఎవరి తరమూ కాదు.

      బాబా గారు అస్వస్థులై సమాధి చెందక ముందు "నన్ను రాతి మందిరములో ఉంచుడు" అన్న పల్కులు, తానే మురళీధరుడని తెలియజేయుచున్నవి. మురళీధరునకు సంబంధించిన స్థలమునందు బాబాను మహాసమాధి చేయుటచే బాబాయే మురళీధరుడనియు, బూటీవాడాయే సమాధి మందిరమనియు అర్థము గ్రహించవలయును.

40వ అధ్యాయము:


      వర్షాకాలములో నదులు సముద్రమునందు కలియునటుల బాబా భక్తులతో కలసి తమ శక్తిని శిష్యులకిచ్చును. బాబా "నన్నే గుర్తుంచుకొను వారిని నేను మరువను. నాకు బండిగాని, రైలు గాని, టాంగాగాని, విమానము గాని అవసరము లేదు. నన్ను ప్రేమతో పిలుచు వారియొద్దకు నేను పరుగెత్తి పోయి ప్రత్యక్షమయ్యెదను" అనిరి. భక్తులు సంపూర్ణముగా సద్గురువును శరణు వేడినచో సద్గురువు తమ భక్తుల యిండ్లలో శుభకార్యములను సవ్యముగా నెరవేరునట్లు జూచెదరు.

41వ అధ్యాయము:

      ఎవరికైతే ఆధ్యాత్మిక విషయములలో ఎక్కువ శ్రద్ధయో వారిని బాబా ప్రేమించుటయే గాక వారి కష్టములను తొలగించి వారిని ఆనందభరితులుగా జేయుదురు. బాబాగారు సర్వహృదయ నివాసుడు. తన గురించిగాని, యితరుల గురించిగాని, ఏ విషయమైనా తెలుసుకోవాలని భక్తులు యితరులను ప్రశ్నించునపుడు బాబా గార్కి వారి నైజము నచ్చదు. ఏదైనా అడగాలని ఉంటే, నేనుండగా, యితరులను ఎందుకు అడుగుతావు అనేవారు.

42వ అధ్యాయము:

బాబా సమాధి చెందుట:

    సద్గురుని పాదారవిందములను జ్ఞప్తియందుంచుకొనినచో మన కష్టములు నశించును. మరణము దాని నైజమును కోల్పోవును. ఐహిక దుఃఖములు నశించును. ఎవరైతే తమ క్షేమమును కోరెదరో వారు శ్రీ సాయి లీలలను జాగ్రత్తగా వినవలెను. అది వారి మనస్సు పావనము చేయును. బాబాగారు తన మరణమును ముందుగా సూచించి, భక్తులైన రామచంద్ర, తాత్యా కోటే పాటిళ్ళ మరణమును తప్పించెను. వారికి బదులుగా తాను 1918 సం|| అక్టోబరు 15వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 2.30 గం||లకు పవిత్రమైన విజయదశమి పర్వదినాన స్వర్గస్థులైరి. దీనిని బట్టి భక్తులపైన బాబా గారికి విశేషమైన ప్రేమ, అభిమానము అని తెలియుచున్నవి.

      లక్ష్మీ బాయి అను భక్తురాలు తొందరగా తెచ్చిపెట్టిన రొట్టెకూడ ఆకలిగాయున్న కుక్కకు వేసి, బాబాగారు "కుక్క ఆకలి దీర్చుట నా ఆకలి తీర్చుట వంటిది, ఎవరైతే ఆకలితో యున్నవారికి భోజనము పెట్టెదరో వారు నాకు అన్నము పెట్టినట్లు" దీనినే గొప్ప నీతిగా ఎరుగుము. దీనిని బట్టి బాబా సర్వజీవులందు గలడని తెలుసుకొనుము. బాబా సర్వ వ్యాపి, చావు-పుట్టుకలు లేనివాడు. అమరులు. యోగులు శరీరము ధరించి ఏదో పనిమీద భూలోకమునకు వత్తురు. అది నెరవేరిన పిమ్మట వారెంత నెమ్మదిగాను, సులభముగాను అవతరించెదరో అంత శాంతముగా వెళ్ళెదరు.

43, 44వ అధ్యాయములు:


బాబా సమాధి పొందుటకు తరువాయి భాగము:


      ఎవరైతే ప్రపంచ విషయములందు మనస్సును మరలించి చనిపోవుటకు ముందు భగవత్ విషయములయందు లీనమొనరించినచో మరణించువారు పరమును సహజముగాను, సులభముగాను పొందుదురు. బాబా భగవంతుని అవతారమైన యప్పటికి మానవ రూపములో యుండుటవలన యితరులకు ఆదర్శముగా ఉండుటకు తాను సమాధి స్థితికి చేరుముందు వజ్ అను భక్తుని పిలిచి "రామవిజయము" అను గ్రంథమును ౧౪ దినములు పారాయణము గావించిరి.


      చనిపోయిన పిదప కూడా బాబా గారు శ్యామాకు మేనమామ అగు లక్ష్మణ్‍మామాజోషీకి స్వప్నములో గాన్పించి "భక్తులు నేను మరణించేననుకొను చున్నారు. నీవు పూజ చేసి కాకడ హారతిని యిమ్ము" అని ఆదేశించారు.
  

      మరణించి 36 గంటలు అయినప్పటికినీ బాబా గారి శరీరము గాలి పట్టి బిగిసిపోలేదు. అవయవములన్నియు సాగుచుండెను. వారి కఫినీ చింపకుండ సులభముగా తీయగల్గిరి. బాబా భౌతిక శరీరము విడచుటకు కొన్ని దినముల ముందు తాను నిత్యము తోడు-నీడగా భావించి ఆత్మానుసంధానము చేయు యిటుక ఒక బాలుని వలన జారి క్రిందపడి రెండు ముక్కలాయెను. అప్పుడు బాబా గారు మిగుల చింతించి యిట్లనిరి. "ఇటుకకాదు, నా అదృష్టమే ముక్కలు ముక్కలుగా విరిగి పోయినది. నా జీవితమునందు నాకు ఎంత ప్రేమో, దానియందు నాకంత ప్రేమ. ఈ రోజు అది నన్ను విడిచినది". ఇటుక విరుగుటకు పూర్వము 32 సంవత్సరముల క్రిందట, అనగా 1886 వ సంవత్సరములో, బాబా గారు 72 గంటలు సమాధి స్థితిలో ఉండి, పిదప ప్రాణముతో లేచెను. దీనిని బట్టి చదువరులు ఆలోచించవలసిన విషయము ఏమన బాబా ౩ మూరల శరీరమా, లేక లోపలయున్న ఆత్మయా!

అమృతతుల్యమగు పలుకులు:

      బాబా "ఎవరైతే నన్ను ఎక్కువగా ప్రేమించెదరో, వారెల్లప్పుడు నన్ను దర్శింతురు. ఎవరైతే నాకర్పించనిదే ఏమియు తినరో, అట్టి వారిపై నేను ఆధారపడియుందును. నీవు గర్వము, అహంకారము లేశమైన లేకుండ నీ హృదయములో నున్న నన్ను సర్వశ్య శరణాగతి వేడవలెను. అట్లు ఎవరు చేయుదురో వారికి మోక్షమునిచ్చి, వారి ఋణము తీర్చుకుందును. నీలోనే గాక, అన్నిటిలోను నన్ను చూడుము. దీనిని అభ్యసించినచో సర్వవ్యాపకత్వము అనుభవించి నాలో ఐక్యము పొందెదవు. ఎవరైతే యితరులను నిందించెదరో వారు నన్ను హింసించినంత వారగుదురు. ఎవరైతే బాధలను అనుభవించెదరో, ఓర్చుకుందురో వారు నాకు ప్రీతిగూర్చెదరు".

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కి జై!

27, డిసెంబర్ 2010, సోమవారం

శ్రీ సాయి సచ్చరిత్ర సారాంశము - సోమవారము పారాయణము



శ్రీ సాయి సచ్చరిత్ర సారాంశము  
(సోమవారము పారాయణము) 
మూలము: శ్రీ హేమాదు పంత్ చే రచింపబడి షిరిడీ సంస్థానము వారిచే ముద్రింపబడిన శ్రీ సాయి సచ్చరిత్రము నుండి.
క్లుప్తీకరణ: సి.హెచ్.కె.సూర్య ప్రకాశ రావు 
సాయి భక్తుడు 

 31 వ అధ్యాయము:

    మరణకాలమందు మనస్సునందున్న కోరిక గాని, ఆలోచనగాని ఆ వ్యక్తి భవిష్యత్తును నిర్నయించును. భగవద్గీత 8వ అధ్యాయం, 5,6 శ్లోకములలో శ్రీకృష్ణుడిట్లు చెప్పియున్నారు. "ఎవరైతే వాని అంత్యదశయందు నన్ను జ్ఞప్తియందుంచుకుందురో వారు నన్ను చేరెదరు". "ఎవరో ఏదో మరొక దానిని ధ్యానింతురో వారు దానిని పొందుదురు". యోగులకు పాదములకడ వినమ్రులై ప్రాణములు విడుచువారు రక్షింపబడుదురు. వారెంతో పుణ్యము చేయనిదే వారికట్టి సద్గతి కలుగదు.

32 వ అధ్యాయము:

    ఒకడెంత పండితుడైనప్పటికి, వేదవేదాంగములు బాగుగా చదివినప్పటికిని తన గమ్య స్థానమునకు సురక్షితముగా పోలేడు. మార్గదర్శియే యుండి సహాయపడి సరియైన దారి చూపినచో మార్గములో ఉన్న గోతులనుండి, అడవి మృగములనుండి తప్పించుకొని సుగమముగా పయనించును.

    పుస్తక జ్ఞానము ఎందుకు పనికిరానిది. మనకు విధింపబడిన కర్మను మనము పూర్తిచేసి తనువును, మనమును, పంచప్రాణములను గురువు పాదములపై పెట్టి శరణు వేడవలెను. గురువే దైవము. సర్వమును వ్యాపించువాడు. అట్టి ప్రత్యయము ఏర్పడుటకు దృఢమైన, అంతులేని నమ్మకము అవసరము అని బాబా అనెను. వివేకమునకు, వైరాగ్యమునకు అవతారము సాయి. ధర్మము, అర్ధము, కామము మన కృషి వలన లభించును. కాని మోక్షము గురువు సహాయము వలననే లభించును. బాబా ఎన్నడునూ ఉపవసించలేదు. ఇతరులను కూడ ఉపవాసము చేయనిచ్చువారుకాదు. ఉపవాసము చేయువాని మనస్సు స్థిమితముగా యుండదు. మొదట ఆత్మను శాంతింపజేయ వలయును.

33 వ అధ్యాయము:

ఊదీ మహిమ 1: బాబా బోధించిన విధము.

    ప్రపంచములో కనిపించు వస్తువులన్నియు బూడిదవలె అశాశ్వతములు. పంచభూతములచే చేయబడిన మన శరీరములు సర్వ సౌఖ్యములు అనుభవించిన పిమ్మట పతనమై బూడిదగును. ఈ సంగతి జ్ఞప్తికి తెచ్చుటకై బాబా భక్తులకు ఊదీ ప్రసాదమును పంచిపెట్టుచుండెను. ఈ ఊదివలన బ్రహ్మము నిత్యమనియు, ఈ జగత్తు అశాశ్వతమనియు, ప్రపంచములో గల బంధువులు (ఉదాహరణకు కొడుకుగాని, తల్లిగాని, తండ్రిగాని) మనవారు కారనియు బాబా బోధించెను. ఈ ప్రపంచములోనికి మనము ఒంటరిగా వచ్చి తిరిగి ఒంటరిగా పోయెదము. ఊది అనేక విధముల శరీర మానసిక రోగములను బాగు చేయుచుండెను. ఊది ఆరోగ్యమును, ఐశ్వర్యమును, ఆతురతల నుండి విమోచనము యొసంగుచుండెను. బాబా మొదటిదియైన ఊది వివేకమునకు, రెండవదియైన దక్షిణ వైరాగ్యమును బోధించుచుండెను. ఈ రెండును కల్గియున్నగాని సంసారమనే సాగరమును దాటలేము.

    కావును బాబా ఊదీని పొందుభాగ్యము కలవారు స్నానము చేసిన పిమ్మట ఊదీని నుదుట రాసుకొని కొంచము నీటిలో కలిపి బాబా పవిత్రమైన తీర్థముగా భావించి పుచ్చుకొనవలెను. బాబా సమాధి సమయమప్పుడు లక్ష్మీబాయి షిండేకు 9 రూపాయలు యిచ్చిరి. అవి నవవిధ భక్తులను తెలియజేయును.

34 వ అధ్యాయము:
 

ఊదీ మహిమ 2:
 

    బాబా "ఎవరైతే ఈ మసీదుకు వచ్చెదరో వారెన్నడు ఈ జన్మలో ఏ వ్యాధిచేతను బాధపడరు. ఇది మసీదుకాదు. ఇది ద్వారవతి. ఎవరైతే యిందు కాలు మోపెదరో వారు ఆరోగ్యమును, ఆనందమును పొందెదరు. వారి కష్టములు గట్టెక్కును". అని తెలిపిరి. మన కష్టసుఖములకు మన కర్మయే కారణము. అల్లాయే ఆర్తి తీర్చువాడు. వానినెల్లప్పుడును ధ్యానించుము. నీవు సర్వస్య శరణాగతి వేడుము. అటుపై వారేమి చేసెదరో చూడుము.

    కర్మ యొక్క మార్గము విచిత్రమైనది. నేను భగవంతుడనుకాను, ప్రభువును కాను. వారి నమ్మకమైన బంటును. వారినెల్లప్పుడు జ్ఞాపకము చేయుచుందును. "ఎవరైతే తమ అహంకారమును ప్రక్కకుతోసి భగవంతునికి నమస్కరించెదరో ఎవరు వారిని పూర్తిగా నమ్మెదరో వారి బంధములూడి మోక్షమును పొందెదరు" అని నుడివెను.

35 వ అద్యాయము:
 

ఊది మహిమ 3:
 

    బాబా "నేను ఒక రూపాయి దక్షిణ ఎవరివద్ద నుంచిగాని తీసుకొనినచో దానికి 10 రెట్లు యివ్వవలయును. నేను ఊరక ఏమియు తీసుకొనను. యుక్తాయుక్తములు తెలియకుండ నేనెవరిని అడుగను. ఫకీరు ఎవరిని చూపునో వారి వద్దనే నేను తీసుకొనెదను. ఎవరైన గత జన్మ నుండి బాకీ యున్నచో వారి వద్ద ధనము పుచ్చుకొందును. దక్షిణ యిచ్చుచున్నచో వైరాగ్యము పెరుగును. దానివలన భక్తి, జ్ఞానములు కల్గును.
నిద్ర పట్టని రోగులకు బాబా చెప్పినది.

      ప్రతిరోజు నిద్రించుటకు ముందు కొంచెము ఊది నుదుటికి వ్రాసికొని మిగతా పొట్లము తలక్రింద దిండునకు దిగువ పెట్టుకొనవలెను. ఒకనాడు ఒకరి యింటిలో భోజనమునకు పిలిచిన బంధువులకన్న మూడు రెట్లు బంధువులు వచ్చిరి. ఏమి చేయాలో తెలియక అత్తగారు చెప్పిన ప్రకారము కోడలు వండిన పదార్థముల మీద ఒక గుడ్డ కప్పి సాయిని ధ్యానించి కొంచము ఊది వేసెను. బంధువులందరకు భోజనము పెట్టగా యింకను చాల మిగిలిపోయెను. ఇది ఊదీ మహిమ. సాయి మహాత్మ్యము.

36 వ అధ్యాయము:

     బాబా దక్షిణ తీసుకొను విషయములో శ్యామాతో, "నీకేమియు తెలియదు. నేనెవరి వద్ద ఏమి తీసుకొనను. మసీదుమాయి బాకీను కోరును. బాకీ యున్నవాడు దక్షిణ చెల్లించి ఋణవిమోచన పొందును". బాబా ఎన్నడును భిక్షమెత్తలేదు. సరికదా. తమ భక్తులు కూడ భిక్షమెత్తుకొనుటకు ఒప్పుకొనలేదు. వారు ధనమును ప్రమాదకారిగాను, పరమును సాధించుటకు అడ్డుగాను భావించువారు.

    బాబా సర్వజ్ఞుడు అని తెలియజేయుటకు శ్యామా బుగ్గగిల్లి తనను శ్యామాకు 72 జన్మల సంబంధము తెలియజేసెను. వివాహమై 27 సంవత్సరాలైనా కూడ సంతానములేని ఒకామెకు తన ఆశీర్వాదముతో సంతానము కలుగజేసెను. దీనిని బట్టి బాబా సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి, దత్తాత్రేయస్వామి అని తెలియుచున్నది.

37 వ అధ్యాయము:

చావడి ఉత్సవము:

    సాయి భక్తులు రాత్రి పడుక్కొనేముందు ఎవరు చావడి ఉత్సవమును జ్ఞప్తికి తెచ్చుకొని మననము చేయుదురో వారికి సుఖము, సంతోషము, తృప్తి, మనశ్శాంతి, సాయి ఆశీర్వాదము కల్గును.

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కి జై!

26, డిసెంబర్ 2010, ఆదివారం

శ్రీ సాయి సచ్చరిత్ర సారాంశము - ఆదివారము పారాయణము


శ్రీ సాయి సచ్చరిత్ర సారాంశము  
(ఆదివారము పారాయణము) 

మూలము: శ్రీ హేమాదు పంత్ చే రచింపబడి షిరిడీ సంస్థానము వారిచే ముద్రింపబడిన శ్రీ సాయి సచ్చరిత్రము నుండి.


క్లుప్తీకరణ: సి.హెచ్.కె.సూర్య ప్రకాశ రావు 
సాయి భక్తుడు 


23 వ అధ్యాయము:

      జీవుడు త్రిగుణములకు అనగా సత్వ, రజో, తమోగుణములకు అతీతుడు. కాని మాయచేత కప్పబడి వాని నైజమగు సచ్చిదానందమును మరచుచు తాను శరీరము అనుకొనుచు అట్టి భావనతో తానే చేయువాడు, అనుభవించువాడు అని అనుకొనుచు లెక్కలేనన్ని బాధలతో చిక్కుకుని విముక్తిని గాంచలేకున్నాడు. విమోచనమునకు మార్గమొక్కటే గలదు. అది గురుని పాదములందు ప్రేమమయమగు భక్తి. మాయ అను మహాసముద్రమును దాటుటకు బాబా పాదములను హృదయములో ధ్యానించవలయును. బాబా ఎప్పుడు భగవంతుని సేవకుడనని చెప్పెడివాడు.

      శిష్యులు 3 రకములు: 1. గురువులకు ఏమి కావలెనో గుర్తించి వారు ఆజ్ఞాపించక పూర్వము దానిని నెరవేర్చువారు ఉత్తమ శిష్యులు. 2. గురువు ఆజ్ఞానుసారము ఆలసింపక అక్షరాల నెరవేర్చువారు మధ్యములు. 3. అడుగడుగున తప్పులు చేయుచు గురుని ఆజ్ఞను వాయిదా వేయువారు అధములు.

24 వ అధ్యాయము:

      మనం సద్గురుని పాదములకు అహంకారమును సమర్పించినగాని మన ప్రయత్నముందు జయము పొందము. మనం అహంకార రహితులమైనచో మనకు జయము నిశ్చయము. సాయిబాబాను పూజించుటచే యిహపర సౌకర్యములను రెంటిని పొందవచ్చును. శాంతి సౌఖ్యములను పొందెదము. పంచేంద్రియముల కంటే ముందే మనస్సు, బుద్ధి విషయానందమును అనుభవించును. అందువలన ఏదైనా తినుటకు ముందు భగవంతుని స్మరించవలయును. గురువునకు, దేవునకు ఎవరు బేధము నెంచెదరో వారు దైవమును ఎచ్చటను చూడలేరు.

      బాబా తన భక్తులకు వారి వారి ఇష్టానుసారము సేవ చేయుటకు అనుమతించుచుండెను. దీనిలో ఇతరులు జోక్యము కలుగ జేసుకొనుట బాబాకిష్టము లేదు. ఎవరైతే దగ్గరున్న వానికి ఇయ్యకుండ తిందురో వారు కుచేలునివలె దారిద్ర్యమును అనుభవించవలసి వచ్చును.

25 వ అధ్యాయము:

      భక్తునకు స్థిరమైన నమ్మకము, పూర్ణ భక్తియున్నపుడు వాని కోరికలన్నియు శీఘ్రముగా నెరవేరును.
బాబా: నేను సమాధి పొందినప్పటికిని, నా సమాధిలోంచి నా ఎముకలు మాట్లాడును. అవి మీకు ఆశను, నమ్మకమును కలిగించును. నేనే గాక నా సమాధి కూడ మాట్లాడును. కదులును. మనః పూర్వకముగా శరణుజొచ్చిన వారితో మాట్లాడును. నేను మీవద్ద ఉండనేమో అని మీరు ఆందోళన పడవద్దు. నా ఎముకలు మాట్లాడుచు మీ క్షేమమును కనుగొనుచుండును. ఎల్లప్పుడూ నన్నే జ్ఞప్తియందుంచుకొనుడు. నాయందే మనః పూర్వకముగను, హృదయపూర్వకముగను నమ్మకముంచుడు. అప్పుడే మీరు మిక్కిలి మేలు పొందెదరు.

      ఎప్పుడైనను, ఎక్కడైనను నా గురించి చింతించినచో నేను అక్కడనే ఉందును. మామిడి చెట్టుకు పూసిన పూత అంతయు పువ్వులు, కాయలు, పండ్లు అవదు. రాలిపోవును. బాబా వద్ద చేరిన వారందరూ ఆశీర్వాదము పొందలేరు. దానికి స్థిరమైన భక్తి-విశ్వాసము కావలయును. బాబా జ్యోతిష్యము అన్నా, జ్యోతిష్యుని మాటలు ప్రక్కన పెట్టేవారు.

26 వ అధ్యాయము:

      బాబా భక్తులతో "ఏమైనను కానిండు. పట్టు విడువరాదు. నీ గురునియందే ఆశ్రయము నిలుపుము. ఎల్లప్పుడూ నిలకడగా యుండుము. ఎప్పుడూ వారి ధ్యానమునందే మునిగి యుండుము" అని ఉపదేశించెను. "ఎవరైకైతే నమ్మకము, ఓపిక గలదో వారిని తప్పక భగవంతుడు రక్షించును. దేవునివలె యోగీశ్వరులు కూడ తమ భక్తులపై ఆధారపడెదరు. ఏ భక్తుడు హృదయపూర్వకముగను, మనః పూర్వకముగను పూజించి శరణువేడునో వానికే భగవంతుడు తోడ్పడును".

      బాబా అంబేద్కర్ అను భక్తునితో "గతజన్మ పాప పుణ్యములను నీవు అనుభవించక తీరదు. నీ అనుభవము పూర్తి కాకున్నచో ప్రాణత్యాగము నీకు తోడ్పడదు. నీవు ఇంకొక జన్మ ఎత్తి బాధ అనుభవించవలయును. చచ్చుటకు ముందు కొంతకాలమేల నీ కర్మ అనుభవించరాదు. గతజన్మముల పాపములనేల తుడిచివేయరాదు. దానిని శాశ్వతముగా పోవునట్లు చేయుము".

27 వ అధ్యాయము:

      బాబా కోరికలను నెరవేర్చు కల్పతరువు. జ్ఞానమునకు సముద్రము వంటివారు. ఆత్మ సాక్షాత్కారమునకు దారి చూపు గురువు శ్రీసాయి. సర్వజీవులయందును భగవంతుని చూచునట్లు చేయగల యోగీశ్వరుడు. ఎవరికేది ముఖ్యమో గ్రహించి అటువంటి గ్రంధములు భక్తులకు, శిష్యులకు యిచ్చి వారిచేత పారాయణ చేయించు పూజ్యులు.

28 వ అధ్యాయము:

      బాబా సర్వాంతర్యామి. సాధారణముగా తండ్రి శరీరమును పుట్టించును. పిమ్మట చావు జీవితమును వెంబడించును. కాని సద్గురువు చావు, పుట్టుకలను రెంటిని దాటించును. కాబట్టి వారు అందరికంటె దయార్ద్ర హృదయులు. బాబా "నా మనుష్యులు ఎంతదూరమున ఉన్నప్పటికీ పిచ్చుక కాళ్లకు దారము కట్టి ఈడ్చినటుల అతనిని షిరిడీకి లాగెదను". "ప్రవేశించుటకు నాకు వాకిలి అవసరములేదు. నాకు రూపము లేదు. నేను అన్ని చోట్ల నివసించుచున్నాను. ఎవరైతే నన్నే నమ్మి, నా ధ్యానమునందే మునిగియుందురో వారి పనులన్నియు సూత్రధారినై నేనే నడిపించెదను".

      భగవంతుని దర్శనమునకు గాని, పండుగరోజు గడుపుటకు గాని, తీర్థయాత్ర పోవుటకుగాని అప్పు చేయరాదని బాబా అభిప్రాయము. మేఘశ్యాముడను నిజ భక్తుడు ఒక దినము బాబాకు తలంటుస్నానము చేయతలంపుతో హరేగంగ, హరేగంగ అనుచు తలపై, శరీరముపై నీళ్ళు పోయగా, తలయే తడిసెను. శరీరము పొడిగాయుండెను. అక్కడ భక్తులు ఆశ్చర్యచకితులైరి.

29 వ అధ్యాయము:

      ఎవరికేది క్షేమమో బాబాకే తెలియును. సంశయములు, కష్టములు మన భక్తిని స్థిరపరచుటకు మనలను చుట్టుముట్టును. మనలను పరీక్షించును. పూర్తి విశ్వాసముతో బాబాను కొలుచుచు మన కృషిని సాగించినచో మన ప్రయత్నములన్నియు తుదకు విజయవంతమగును.

30 వ అధ్యాయము:

      బాబా నిర్గుణ స్వరూపులు అయినను భక్తులు కోరుటచే సగుణ స్వరూపము వహించిరి. ఇతరులు మనలను విడిచి పెట్టినప్పటికిని సాయి మాత్రము మనలను విడువడు. వారి కృపకు పాత్రులైనవారు కావలసినంత శక్తి, జ్ఞానము, నిత్యానిత్య వివేకములను పొందెదరు. భక్తుల కోర్కెలను పూర్తిగా గ్రహించి సాయి వానిని నెరవేర్చును. యోగి దర్శనమునకై భక్తుడు ఎంత వేదన పడునో, ఎంత భక్తి విశ్వాసములు చూపునో అంత త్వరగాను, బలముగాను అతని కోరిక నెరవేరును.

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

25, డిసెంబర్ 2010, శనివారం

శ్రీ సాయి సచ్చరిత్ర సారాంశము - శనివారము పారాయణము

శ్రీ సాయి సచ్చరిత్ర సారాంశము  
(శనివారము పారాయణము) 

మూలము: శ్రీ హేమాదు పంత్ చే రచింపబడి షిరిడీ సంస్థానము వారిచే ముద్రింపబడిన శ్రీ సాయి సచ్చరిత్రము నుండి.

క్లుప్తీకరణ: సి.హెచ్.కె.సూర్య ప్రకాశ రావు 
సాయి భక్తుడు 


16, 17 అధ్యాయములు:

      బ్రహ్మజ్ఞానమును పొందగోరి వచ్చినవానితో బాబాగారు "బ్రహ్మజ్ఞానము సంపాదించుట అంత సులభమైన పనికాదు. ముఖ్యముగా పేరాశ గలవానికి మిక్కిలి దుర్లభము. బ్రహ్మమును జూచుటకు 5 వస్తువులు సమర్పించవలయును. అవి ఏవన 1. పంచ ప్రాణములు  2. పంచేంద్రియములు  3. మనస్సు  4.బుద్ధి  5. అహంకారము. లోభికి శాంతిగాని, సంతుష్టి గాని, దృఢనిశ్చయముగాని ఉండవు".
       
      "నా ఖజానా నిండుగా ఉన్నది. ఎవరికేది కావలసిన దానిని వారికివ్వగలను. కాని వానికి పుచ్చుకొను యోగ్యత కలదా! లేదా! అని నేను మొదట పరీక్షించవలయును. నేను చెప్పినదానిని జాగ్రత్తగా విన్నచో నీవు తప్పక మేలు పొందెదవు. ఈ మసీదులో కూర్చొని నేనెప్పుడు అసత్యములు పలుకను". బాబాగారి విశిష్టత ఏమిటంటే ఆయన ఆత్మ సాక్షాత్కారము పొందిన యోగి అయినప్పటికి ప్రజలకై పాటుబడే వారిలో ప్రథమగణ్యులు.

18, 19 అధ్యాయములు:

      మానవుని పాపకర్మలు ముగియు వేళకు భగవంతుడు వానికొక యోగీశ్వరునితో కలసికొనుట సంభవింపజేయును. వారు తగిన సలహానిచ్చి భక్తుల క్షేమము చూసెదరు. అటువంటి యోగీశ్వరుడు సాయిబాబాగారు. మన అదృష్టము కొలది వారి పాదములకు చేరగలిగేము. బాబా గారు 2 పైసలు దక్షిణగా అడుగుచుండిరి. ఒక పైసా దృఢమైన విశ్వాసమునకు, రెండవది ఓపిక లేదా సహనమునకు.

బాబా సందేశము:

      మంత్రము గాని, ఉపదేశముగాని ఎవరి వద్దనుండి పొందుటకు ప్రయత్నించకు. నీ ఆలోచనలను, చేష్టలను నా కొరకే ఉపయోగించుము. నీవు తప్పక పరమార్థము పొందెదవు. నావైపు సంపూర్ణ హృదయముతో చూడుము. నేను నీవైపు అటులనే చూసెదను. నీ గురువునందు నమ్మకము, విశ్వాసము ఉంచుము. గురువును త్రిమూర్తుల అవతారమని ఎంచుము. వారు ధన్యులు. ఈ మసీదులో కూర్చొని నిజము తప్ప మరేమియు మాట్లాడను. ఆత్మ సాక్షాత్కారమునకు ధ్యానము అవసరము.

      ఏదైనా బంధము ఉండనిదే ఒకరు ఇంకొకరివద్దకు పోరు. ఎవరైన ధనముకొరకు నీ వద్దకు వచ్చినచో నీకిచ్చుటకు యిష్టము లేకున్నచో నీవు ఇవ్వనఖ్ఖరలేదు. వానిపై కుక్కవలె మొరగవద్దు. యితరులు నిన్ను ఎంతగా నిందించినను నీవు కఠినముగా జవాబు యివ్వకుము. అట్టి వానిని నీవు ఎల్లప్పుడూ ఓర్చుకొనినచో నిశ్చయముగ నీకు సంతోషము కల్గును.


      నీకు నాకు మధ్యగల గోడను నిర్మూలించుము. ఎవరైతే తమ జీవిత పరమావధిని పొందెదరో వారు అమరులై సుఖముగా నుండెదరు. తక్కిన వారందరూ పేరునకే ఊపిరి సలుపు వరకు మాత్రమే బ్రతికెదరు. యితరులను నిందించిన నీకు తోడ్పడదు. ఆత్మ సాక్షాత్కారమునకు సాధ్యమైనంత పాటుపడవలెను. ఎంత కృషి చేసిన అంత మేలు.


   తన కర్తవ్య కర్మలు చేయుచు భగవంతునికి సర్వస్వ శరణాగతి చేయవలయును. వారు దేనికి భయపడనవసరము లేదు. ఎవరైతే భగవంతుని పూర్తిగా నమ్మెదరో వాని లీలలు విని యితరులకు చెప్పెదరో యితర విషయములు ఏమియు ఆలోచించరో వారు తప్పక ఆత్మ సాక్షాత్కారము పొందుదురు.


      ఒకరి కష్టము యింకొకరు ఉంచుకొనరాదు. కష్టపడు వాని కూలి సరిగాను, దాతృత్వముతోను ధారాళముగా యివ్వవలెనని బాబా చెప్పెను.

20 వ అధ్యాయము:

      మౌలికముగా సాయి నిరాకారుడు. భక్తుల కొరకు ఆకారమును ధరించెను. కష్టసుఖములు అను భావములు మన మనోవైఖరిపై ఆధారపడి యుండును. ఉపనిషత్తులలోని నీతి ప్రకారము ఉన్నదానితో సంతృష్టి చెందుము. ఏది మనకు సంభవించుచున్నదో అది అంతయు భగవంతుని ఆజ్ఞతో సంభవించుచున్నది. తుదకది మన మేలుకొరకేయని గ్రహించవలయును. యింకొక నీతి ఏమన, మనుష్యుడు ఎల్లప్పుడు తనకు విధింపబడిన కర్మలను చేయుచుండవలయును. కర్మ చేయకుండుట ఆత్మ నాశనమునకు కారణము.

21 వ అధ్యాయము:

      భగవంతుని ఆదేశానుసారము యోగులు అనేకచోట్ల అవతరించెదరు. వారు చేయు పనులు ఒకరు చేయునది ఇంకొకరికి తెలియును. ఒకరు చేసినదానిని ఇంకొకరు పూర్తి చేయుదురు. బాబా గారు వి.కె.ఠాకూరు తో "ఈ ఆధ్యాత్మిక మార్గము మిగుల కఠినమైనది. కావలసినంత కృషి చేయవలయును. ఆశీర్వాదము లేని ఉత్త పుస్తక జ్ఞానము ప్రయోజనము లేనిది. చదివినంతయు ఆలోచించి ఆచరణలో పెట్టవలయును" అనిరి.


      అనంతరావు పాటిలు తో, "భక్తి లేని సాధనములన్నియు అనగా జపము, తపము, యోగము, మతగ్రంధ పారాయణము, వానిలోని సంగతులను ఇతరులకు బోధించుట నిష్ప్రయోజనము" లనిరి.


      పండరీపురం ప్లీడరు తో, "ప్రజలెంత టక్కరులు. వారు పాదములందు బడెదరు. దక్షిణ యిచ్చెదరు. చాటున నిందించెదరు" అని బాబాగారు ఉపదేశించిరి.

22 వ అధ్యాయము:

      బాబా గారు "నా ప్రకాశమును చూడవలెనంటే అహంకారమును విడిచి మిక్కిలి అణకువతో చూపుడువ్రేలుకు, మధ్యవ్రేలుకు మధ్యనున్న బొటనవ్రేలుపై దృష్టిని సారించినచో నా ప్రకాశము చూడగలరు. యిది భక్తికి సులభమైన మార్గము" అనేవారు.


      షిరిడీలో గల ద్వారకామాయి తల్లి వంటిది. ఎవరికైతే ఒక్కసారి ద్వారకామాయి (తల్లి) తొడపై కూర్చొనెదరో వారిని ద్వారకామాయి కష్టములనుండి తప్పించును. ఆనందమును కల్గించును అని నుడివిరి.


      బాబా గారి అభిప్రాయము:  "మనము అన్ని జీవులను ప్రేమించవలయును. ఎవరూ, ఎవరినీ, ఏమీ చేయలేరు. ఎవ్వరునూ స్వతంత్రులు కారు. భగవంతుడు సకల జీవులందు నివసించుచున్నాడు. దేనికైనా భగవదాజ్ఞ అవసరము".

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

24, డిసెంబర్ 2010, శుక్రవారం

శ్రీ సాయి సచ్చరిత్ర సారాంశము - శుక్రవారము పారాయణము

శ్రీ సాయి సచ్చరిత్ర సారాంశము  
(శుక్రవారము పారాయణము) 


మూలము: శ్రీ హేమాదు పంత్ చే రచింపబడి షిరిడీ సంస్థానము వారిచే ముద్రింపబడిన శ్రీ సాయి సచ్చరిత్రము నుండి.

క్లుప్తీకరణ: సి.హెచ్.కె.సూర్య ప్రకాశ రావు 
సాయి భక్తుడు
8 వ అధ్యాయము:

      జ్ఞానము వలననే మానవుడు భగవత్ సాక్షాత్కారమును పొందగలడు. యింకే జన్మయందును దీనికి అవకాశము లేదు.
మానవుడు నడవవలసిన మార్గము: శరీరమును అశ్రద్ధ చేయకూడదు. అట్లని దానిని ప్రేమించకూడదు. కావలసినంత జాగ్రత్త మాత్రమే తీసుకొనవలయును.
మానవుడు యత్నించవలసినవి: మానవజన్మ విలువైనదనియు, తుదకు మరణము తప్పదనియు గ్రహించి ఎల్లప్పుడు జాగరూకుడై యుండి జీవిత పరమావధిని సంపాదించుటకై యత్నించవలయును.
నడువ వలసిన మార్గము: క్షమ, నెమ్మది, వైరాగ్యము, దానము, ధర్మము, శరీరమును-మనస్సును స్వాధీనముంచుకొనుట, అహంకారము లేకుండుట మొదలగు శుభలక్షణములు కలిగి యుండుట. సాయిబాబా అట్టి యోగిపుంగవుడు, సద్గురువు.

9 వ అధ్యాయము:

      భక్తుడు ఏదైనను సాయిబాబాకు సమర్పించుకొనవలెనని అనుకొని మరచినచో అట్టి వారికి బాబా జ్ఞాపకము చేసి ఆయర్పితమును గ్రహించి భక్తులను ఆశీర్వదించును. బాబా "నా భక్తులు నన్ను నమ్మినట్లు నేను వారిని చేరదీసెదను. మొదట ఆకలితో యున్న జీవికి భోజనము పెట్టిన పిమ్మట నీవు భుజింపుము. దీనిని జాగ్రత్తగా జ్ఞప్తియందుంచుకొనుము. ఎవరైతే జీవకోటిలో నన్ను చూడగలుగుదురో వారే నా ప్రియ భక్తులు. కాబట్టి నేనొకటి, జీవరాశి ఇంకొకటి అను ద్వంద్వ భావమును, భేదమును విడిచి నన్ను సేవింపుము".

10 వ అధ్యాయము:

      బాబా స్వాధీనమున అష్టసిద్ధులుండెను. బాబా వానిని అభ్యసించనూలేదు, కోరనూలేదు. వారు పరిపూర్ణులు గనుక అవి సహజముగా వారికలవడెను. సాయిబాబా నిజమైన శక్తిని కనుగొనలేనివారు, బాబాను సామాన్య మానవునిగా యెంచినవారు దురదృష్టవంతులని చెప్పవచ్చును. బాబా "మీకు యెవరైనా కీడు చేసినచో ప్రత్యపకారము చేయకుడు. ఇతరుల కొరకు మీరేమైనా చేయగల్గినచో ఎల్లప్పుడు మీరు మేలు మాత్రమే చేయుడు". సంగ్రహముగా యిదియే బాబా యొక్క బోధ. ఇది యిహమునకు, పరమునకు పనికివచ్చును. భగవంతుని కృపాకటాక్షము లేనిదే యోగుల చరిత్రలను వినుటకు మనస్సు అంగీకరించదు. యోగీశ్వరులు వారంతట వారు భూమిపై అవతరించెదరు. మన పూర్వజన్మ సుకృతముచే మనము సాయిబాబా పాదములను బట్టితిమి.

11 వ అధ్యాయము:

      పంచభూతములు బాబా స్వాధీనము. పూజింపదగిన విగ్రహము, యజ్ఞవేదిక, అగ్ని, వెలుతురు, సూర్యుడు, నీరు, బ్రహ్మము - వీటన్నిటి కంటె సద్గురువు ఉత్కృష్టుడు. అటువంటి సద్గురువు సాయి రూపంలో శిరిడీ గ్రామమునందు అవతరించెను.

12 వ అధ్యాయము:

      శిష్టులను రక్షించుటకు, దుష్టులను శిక్షించుటకు భగవంతుడు అవతరించును. కాని యోగుల కర్తవ్యము వేరు. వారికి మంచివాడును, చెడ్డవాడును ఒకటే. వారు దుర్మార్గులను కనికరించి సన్మార్గమున ప్రవర్తించునట్లు చేయుదురు. ఇటువంటి వారిలో సాయిబాబా ముఖ్యులు. వారి యిచ్చలేనిచో భక్తులు బాబా వద్దకు రాలేకుండిరి. ఒకవేళ అదృష్టవశమున భక్తులు బాబా వద్దకు వచ్చినా, బాబా సన్నిధిలో యుండవలెనని కోరినను, అచ్చట యుండలేకుండిరి. బాబా ఆజ్ఞ యెంతవరకు గలదో అంతవరకే వారు షిరిడీలో ఉండగలరు.

13 వ అధ్యాయము:

      "ఎవరైతే భగవంతుని ఆశ్రయించుదురో వారు భగవంతుని కృపవలన మాయనుండి తప్పించుకుందురు. ఎవరు అదృష్టవంతులో, ఎవరి పాపములు క్షీణించినవో వారు నా పూజ చేసెదరు. ఎల్లప్పుడు సాయి! సాయి! అని జపించినచో నిన్ను సప్తసముద్రములు దాటించెదను. పూజాతంతుతో నాకు పనిలేదు. భక్తియున్న చోటనే నా నివాసము. నన్ను విశ్వసింపుము. నీవు తప్పక మేలు పొందెదవు". బాబా తన భక్తుల వద్దనుండి ఏమియు కోరెడివారు గాదు. వారికి గావలసినది భక్తులు పొందే మేలును జ్ఞప్తియందుంచుకొనుట, మార్పులేని గట్టి నమ్మకము, భక్తియును. బాబాగారు ఔషధములు ఉపయోగించకుండ అనేక జబ్బులు నయము చేసెడివారు. బాబావారి వాక్కు, ఆశీర్వాదము అమోఘము. రామబాణము వంటివి.

14 వ అధ్యాయము:

      గతజన్మల పుణ్యము కొలది మనకు మానవజన్మ లభించినది. కాబట్టి దాని సహాయముతో భక్తినవలంబించి, దానివలన జన్మరాహిత్యమును పొందవలయును. బాబా సర్వజ్ఞులు అగుటవలన వారు షిరిడీలో ఉన్నప్పటికీ దూరములో ఏమి జరుగుచుండెనో వారికి తెలియుచుండెను. భక్తులకు దానము గురించి బోధించుటకు, ధనమునందు వారికి అభిమానము పోగొట్టుటకు బాబా దక్షిణ అడుగుచుండెను. బాబాగారి ఆస్తియంతయు ఒక కౌపీనము, ఒక విడి గుడ్డ, ఒక కఫినీ, ఒక తంబిరేకు గ్లాసు మాత్రమే. కాంతా, కనకాలయందు అభిమానము పోయినదని నిరూపించినపుడు బాబా ఆశీర్వాదము వలన మన పారమార్ధిక ప్రగతి శీఘ్రమగును, దృఢపడును.

15 వ అధ్యాయము:

      బాబా "నా ముందర భక్తితో మీ చేతులు చాపినచో వెంటనే రాత్రింబవళ్ళు మీ చెంతనే యుండెదను. శరీరముతో నేనిక్కడ యున్నప్పటికీ సప్తసముద్రములకవతల మీరు చేయుచున్న పనులు నాకు తెలియును. ప్రపంచమున మీ యిచ్చ వచ్చిన చోటుకి పోవుడు. నేను మీ చెంతనే యుండెదను. నా నివాస స్థలము మీ హృదయమునందే గలదు. నేను మీ శరీరములో వున్నాను. ఎల్లప్పుడు మీ హృదయమునందు, సర్వజన హృదయములందు నన్ను పూజింపుడు. ఎవ్వరు నన్ను ఈ విధంగా గుర్తించెదరో వారు ధన్యులు, పావనులు, అదృష్టవంతులు" అని బాబా నుడివెను.

      బాబా సర్వజ్ఞుడని నిరూపించుటకు, బాబాసాహెబ్ జోగ్ తో "ఈ అతిథి చోల్కరుకు టీ కప్పులో విరివిగా చక్కెర వేసి యిమ్ము" అనిరి. అలాగే ఒక భక్తుడు మసీదులో బల్లి కూతకు అర్థమేమని ప్రశ్నించగా, దాని చెల్లెలు దూర ప్రాంతము నుండి వచ్చియున్నదని చెప్పిరి.

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కి జై!

23, డిసెంబర్ 2010, గురువారం

శ్రీ సాయి సచ్చరిత్ర సారాంశము - గురువారము పారాయణము

శ్రీ సాయి రామచంద్రాయ నమః 
శ్రీ సాయి సచ్చరిత్ర సారాంశము  
(గురువారము పారాయణము) 
మూలము: శ్రీ హేమాదు పంత్ చే రచింపబడి షిరిడీ సంస్థానము వారిచే ముద్రింపబడిన
శ్రీ సాయి సచ్చరిత్రము నుండి.
 క్లుప్తీకరణ: సి.హెచ్.కె.సూర్య ప్రకాశ రావు 
సాయి భక్తుడు

ఉపోద్ఘాతము:

      శ్రీ సాయిబాబా సద్గురువు. త్రిమూర్తి స్వరూపుడు. సర్వజ్ఞుడు. శరణాగత రక్షకుడు. యోగీశ్వరుడు. "ఎవరైతే బాబా షిరిడీ లోనే ఉన్నారని అనుకుందురో, వారు బాబాను నిజముగా గ్రహింపలేదని భావింపుము" అని బాబా అనిరి.
ప్రార్థన:

      మనమిప్పుడు సాయిబాబా కు సాష్టాంగ నమస్కారము చేసి వారి పాద పద్మములను బట్టుకొని సర్వజనుల కొరకు ఈ క్రింది ప్రార్థన చేసెదము.  "మా మనస్సు అటు నిటు సంచారము చేయకుండు గాక! మా మనసు నిన్ను తప్ప మరేమియు కొరకుండు గాక! ఈ సచ్చరిత్రము ప్రతి గృహము యందుండు గాక! దీనిని ప్రతి నిత్యమూ పారాయణము చేసెదము గాక! ఎవరైతే దీనిని నిత్యమూ పారాయణ చేసెదరో వారి ఆపదలు తొలగిపోవు గాక! 

బాబా సందేశము:

      మీరెక్కడ ఉన్నప్పటికీ , ఏమి చేసినప్పటికీ నాకు తెలియునని  బాగుగా జ్ఞాపకముంచుకొనుడు.  నేనందరి హృదయములను పాలించువాడను. అందరి హృదయములలో నివసించువాడను. నేను ప్రపంచము నందుగల చరాచర జీవకోటిని ఆవరించి యున్నాను.  ఈ జగత్తును నడిపించు వాడను, సూత్ర ధారిని నేనే. ఎవరైతే తమ దృష్టిని నా వైపు త్రిప్పెదరో, వారికి ఏ హాని, బాధ కలుగదు. ఎవరైతే నన్ను మరచెదరో వారిని మాయ శిక్షించును. పురుగులు, చీమలు, దృశ్యమాన చరాచర జీవకోటియంతయు నా శరీరమే. నా రూపమే.

1 వ అధ్యాయము:

      జ్ఞానోదయమునకు గాని, ఆత్మ సాక్షాత్కారమునకు గాని మొట్ట మొదట పాపములను, కోరికలను తుడిచి వేయవలయును. అటు పిమ్మట త్రిగుణ రాహిత్యమును పొందవలయును. అహంకారము చంపుకొన వలయును.

2 వ అధ్యాయము:

      ఎవరైతే తన అహంకారమును నా పాదములపైని విడిచి పెట్టుదురో, వారికే నేను మిక్కిలి సహాయ పడెదను.

3 వ అధ్యాయము:

       మనస్సు నిలకడగా ఉంచుము. నా మాటలయందు విశ్వాసముంచుము. నా లీలలు వ్రాసినచో అవిద్య నిష్క్రమించును. దానిని శ్రద్ధ, భక్తులతో ఎవరు వినెదరో, వారికి ప్రపంచమందు మమత క్షీణించును. బలమైన భక్తి, ప్రేమ కెరటములు లేచును. ఎవరైతే నా లీలలలో మునిగెదరో, వారికి జ్ఞాన రత్నములు లభించును. ఎవరైతే నన్ను శరణాగతిని వేడెదరో, నన్ను భక్తి విశ్వాసములతో పూజించెదరో, నన్నే స్మరించెదరో, నా ఆకారమును మనసున నిలిపెదరో వారిని బంధనముల నుండి తప్పించుట నా ముఖ్య లక్షణము. "సాయి! సాయి!" యను నామమును జ్ఞప్తి యందుంచుకున్నంత మాత్రమున చెడు పలుకుట, వినుట వలన కలుగు పాపములు నశించును.  

4 వ అధ్యాయము:

      భగవద్గీత చతుర్దాధ్యాయములో  7, 8 శ్లోకములందు శ్రీ కృష్ణ పరమాత్మ సెలవిచ్చునట్లు "ధర్మము నశించునపుడు, అధర్మము వృద్ది పొందునపుడు సన్మార్గులను రక్షించుటకు, దుర్మార్గులను శిక్షించుటకు ధర్మ సంస్థాపన కొరకు యుగ యుగములందు భగవంతుడు గాని, భగవంతుని ప్రతినిధులగు యోగులు, సన్యాసులు అవసరం వచ్చినపుడల్లా అవతరించి కర్తవ్యమును నిర్వర్తించెదరు.  అటువంటి యోగులలో యోగీశ్వరుడు శ్రీ షిరిడీ సాయి నాథుడు. బాబా ఎల్లప్పుడూ "అల్లా మాలిక్", అనగా "అల్లాయే యజమాని" అనెడివారు. వారు 7 రోజులు రాత్రింబవళ్ళు నామ స్మరణ చేయుచుండెడి వారు. దీనినే "నామ సప్తాహము" అందురు.

      బాబా దాసగణు తో "స్నానమునకు ప్రయాగ క్షేత్రము వెళ్లనవసరము లేదు. ఆ గంగా యమునలు ఇక్కడే ఉన్నాయి", అని తన రెండు పాదముల బొటన వ్రేళ్ళ నుండి గంగా-యమునల జలములను కాలువలుగా పారించెను. బాబా షిరిడి లో తాను కూర్చున్న స్థలము తన గురుస్థానమనియు, గురువు గారి సమాధి అక్కడ గలదనియు, దానిని కాపాడవలెననియు చెప్పెను.

5 వ అధ్యాయము:  

       బాబా భాయికృష్ణాజీ తో "అక్కల్ కోటలో ఏమున్నది? అక్కడికేల పోయేదవు?  అక్కడ ఉండే మహారాజు ఇక్కడనే ఉన్నారు. వారు నేనే" అని అనిరి. సాయిబాబా యోగి పుంగవుడు అని బయటి ప్రపంచానికి  తెలియుటకు చాంద్ పాటిల్ అను ధనికుని తప్పి పోయిన గుర్రమును చూపించి ఆశ్చర్య పరచెను. అటులనే మొట్ట మొదట భక్త మహాల్సాపతి బాబా బండి నుండి ఖండోబా దేవాలయం దగ్గర దిగుట చూసి "దయచేయుము సాయీ" అని స్వాగతించెను. అది మొదలు బాబా "సాయిబాబా" గా ప్రఖ్యాతులైరి.

6 వ అధ్యాయము:

       భగవంతుని ఎరుగుటకు కర్మ, జ్ఞాన, యోగ, భక్తి అని నాలుగు మార్గములు కలవు. అన్నింటిలో భక్తి మార్గము కష్టతరమైనది. దాని నిండా ముళ్ళు, గోతులు ఉండును.  సద్గురువుల సహాయముతో ముండ్లను, గోతులను తప్పించుకొని నడచినచో గమ్య స్థానము అవలీలగా చేరవచ్చును. దీనిని గట్టిగా నమ్మమని సాయిబాబా చెప్పుచుండెను. నా భక్తుని ఇంటిలో అన్న వస్త్రములకు ఎప్పుడూ లోటుండదు. మనస్సు చంచలముగా ఉన్నచో ఏకాగ్రత లేనట్టే.
      బాబాకు అన్నదానమనిన చాల ప్రీతి. ఉప్పునీటి బావిలో పువ్వులు వేసి మంచి నీళ్ళుగా మార్చెను. బాబాకు సర్వ మతములు ఒక్కటే. దీనికి ఉదాహరణ శ్రీ రామ నవమి నాడు షిరిడీ లో పగలు హిందువులు శ్రీ రామ నవమి ఉత్సవము, రాత్రులందు మహమ్మదీయులు చందన ఉత్సవము జరుపుకొనుచుండిరి.

7 వ అధ్యాయము:

      బాబా కొలిమిలో చేయి పెట్టి కమ్మరి యొక్క బిడ్డను రక్షించెను. అప్పుడు బాబా "నా చేయి కాలుట నాకంత బాధాకరము గాదు. కాని నా బిడ్డ రక్షింపబడెను అను విషయము నాకు ఆనందము కల్గజేయుచున్నది" అని నుడివెను. ఖాపర్డే కుర్రవాని ప్లేగు జాడ్యము బాగుచేయదలచి తాను నాలుగు పెద్ద ప్లేగు పొక్కులను అనుభవించి అప్పుడు బాబా "చూచితిరా! నా భక్తుల కొరకు నేనిట్లు బాధ పడెదను. వారి కష్టములన్నియు నావిగానే భావించెదను" అని నుడివెను.  సాయిబాబాకు జాతి, మతములతో ఎట్టి సంబంధము లేదు. వారు సర్వజ్ఞులు.  అయినప్పటికీ ఏమీ తెలియని వానివలె కన్పించుచుండిరి.

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై !

22, డిసెంబర్ 2010, బుధవారం

శ్రీ సాయి సచ్చరిత్ర సారాంశము - ముందు మాట

 శ్రీ షిరిడి సాయి సచ్చరిత్రను శ్రీ హేమాదు పంత్ వ్రాయగా షిరిడీ సంస్థాన్ వారు దానిని వివిధ భాషలలో అనువదించి ప్రచురించారు.  ఈ గ్రంథమును పారాయణము చేయని సాయి భక్తులు బహుశా ఉండరు.  ఒకసారి మా మిత్రుని మామగారైన శ్రీ సి.హెచ్.సూర్య ప్రకాశరావు గారు (విశాఖపట్నం వాస్తవ్యులు) అమెరికా సందర్శించినపుడు  వారి సాంగత్యం లభించింది. వారు సాయి భక్తులు.  వారితో కలసి గడిపిన కొద్ది రోజులు మరువ రానివి.  శ్రీ సాయి గురించి వారి అనుభవాలను విని పులకించి పోయాము. శ్రీ సూర్య ప్రకాశ రావు గారు తమ అపార అనుభవము తో బృహత్తరమైన  శ్రీ సాయి సచ్చరిత్రను క్లుప్తముగా "శ్రీ సాయి సచ్చరిత్ర సారాంశము" అను చిన్న రచన చేసి 2010 గురుపూర్ణిమ దినాన సాయి భక్తులకు వినిపించారు. వారి కోరిక మీద (నా అదృష్టము వలన) వారి రచనను చిన్న పుస్తక రూపములో ఆవిష్కరించారు. శ్రీ సూర్య ప్రకాశ రావు గారి అనుమతి పై వారి రచనను యథా తధంగా ఈ 'సాయి వాణి' ద్వారా ప్రపంచ గవాక్షం నుండి అందరు సాయి భక్తులకు అందిస్తున్నాను. ఈ "సాయి సచ్చరిత్ర సారాంశము" ను గురువారం ప్రారంభించి ఏడు రోజుల పారాయణము గా ప్రచురిస్తున్నాను.  గమనించ గలరు. ఇది కేవలం సాయి ఆశీర్వాదం అని నా భావన. -సాయి భక్తుడు సూర్య నారాయణ.
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై! 


శ్రీ సాయి సచ్చరిత్ర సారాంశము
ముందుమాట

పాఠకులకు విజ్ఞప్తి:
శ్రీ సాయి సచ్చరిత్ర సారాంశము అను ఈ చిన్న పుస్తకమును వ్రాయుటకు ముఖ్య ఉద్దేశ్యము:

    నేను 1984 వ సంవత్సరం ఒంగోలు (ఆం.ప్ర., ఇండియా) లో నాగార్జునసాగర్ లో సివిల్ ఇంజనీరుగా పని చేయుచున్నపుడు లాయర్ పేటలో ఉన్న షిరిడీ సాయి మందిరం దర్శించడం, ఎక్కిరాల భరద్వాజ గార్ని దర్శించడం, షిరిడీ పుణ్యక్షేత్ర దర్శనం జరిగాయి. అటుపైన సాయికృప నాపైన, నా కుటుంబం పైన ధారాపాతంగా వర్షించబడినది.  అప్పటి నుండి సాయిసేవలో వెనుదిరగలేదు. నా అనుభవములు కోకొల్లలు.


    నేను ఎందరో వ్రాసిన శ్రీ సాయిసచ్చరిత్ర గ్రంథములు పారాయణ చేసితిని. మూల గ్రంథములో యున్న సంతృప్తి మిగిలిన గ్రంథములు యివ్వలేదు. అప్పటినుండి శ్రీ సాయి సచ్చరిత్ర మూలగ్రంథమును (షిరిడి సాయి సంస్థాన్) క్లుప్తీకరించాలని అనేక సారులు షిరిడీ వెళ్ళినపుడు శ్రీ సాయిని కోరేవాడిని. కారణం ప్రస్తుత కాల మాన పరిస్థితుల ప్రకారం ఈ యంత్రయుగంలో 350 పేజీల మూలగ్రంథమును పారాయణ చేయుట భక్తులకు వీలుపడుటలేదు.
 

    అందువలన మూలమును మార్చకుండా సాయి అనుగ్రహంతో సచ్చరిత్ర సారాంశమును-సాయి సందేశము అను ఈ చిన్న పుస్తక రూపంలో మీకు అందించడమైనది. ఇది నా పూర్వజన్మ సుకృతముగా భావించుచున్నాను.

    సాయి లీలలు అనంతము. ఎవరికి అంతుపట్టనివి. నేను అమెరికా రావడము, మా అమ్మాయి యింట్లో 25 జూలై 2010 గురు పౌర్ణమి ఉత్సవము జరగడము, ఈ చిన్న పుస్తకమును ఆవిష్కరించి సాయి సందేశమును భక్తులకు వినిపించడం, భక్తులు ఎంతో సంతసించి వివిధ భాషలలో ప్రతులను కోరడం జరిగింది. నిజంగా సాయి లీలగాక మరేమిటి.
 

    మీరందరూ భక్తి, శ్రద్ధలతో ఈ చిన్న పుస్తకమును పారాయణ చేయుచు, శ్రీ షిరిడీ సాయి కృపకు పాత్రులు అవాలని కోరుకొనుచున్నాను.

శ్రీ సాయికి సర్వస్య శరణాగతుడను.
మీ సాయి భక్తుడు
సిహెచ్. కె. సూర్యప్రకాశరావు
విశాఖపట్నం