24, డిసెంబర్ 2010, శుక్రవారం

శ్రీ సాయి సచ్చరిత్ర సారాంశము - శుక్రవారము పారాయణము

శ్రీ సాయి సచ్చరిత్ర సారాంశము  
(శుక్రవారము పారాయణము) 


మూలము: శ్రీ హేమాదు పంత్ చే రచింపబడి షిరిడీ సంస్థానము వారిచే ముద్రింపబడిన శ్రీ సాయి సచ్చరిత్రము నుండి.

క్లుప్తీకరణ: సి.హెచ్.కె.సూర్య ప్రకాశ రావు 
సాయి భక్తుడు
8 వ అధ్యాయము:

      జ్ఞానము వలననే మానవుడు భగవత్ సాక్షాత్కారమును పొందగలడు. యింకే జన్మయందును దీనికి అవకాశము లేదు.
మానవుడు నడవవలసిన మార్గము: శరీరమును అశ్రద్ధ చేయకూడదు. అట్లని దానిని ప్రేమించకూడదు. కావలసినంత జాగ్రత్త మాత్రమే తీసుకొనవలయును.
మానవుడు యత్నించవలసినవి: మానవజన్మ విలువైనదనియు, తుదకు మరణము తప్పదనియు గ్రహించి ఎల్లప్పుడు జాగరూకుడై యుండి జీవిత పరమావధిని సంపాదించుటకై యత్నించవలయును.
నడువ వలసిన మార్గము: క్షమ, నెమ్మది, వైరాగ్యము, దానము, ధర్మము, శరీరమును-మనస్సును స్వాధీనముంచుకొనుట, అహంకారము లేకుండుట మొదలగు శుభలక్షణములు కలిగి యుండుట. సాయిబాబా అట్టి యోగిపుంగవుడు, సద్గురువు.

9 వ అధ్యాయము:

      భక్తుడు ఏదైనను సాయిబాబాకు సమర్పించుకొనవలెనని అనుకొని మరచినచో అట్టి వారికి బాబా జ్ఞాపకము చేసి ఆయర్పితమును గ్రహించి భక్తులను ఆశీర్వదించును. బాబా "నా భక్తులు నన్ను నమ్మినట్లు నేను వారిని చేరదీసెదను. మొదట ఆకలితో యున్న జీవికి భోజనము పెట్టిన పిమ్మట నీవు భుజింపుము. దీనిని జాగ్రత్తగా జ్ఞప్తియందుంచుకొనుము. ఎవరైతే జీవకోటిలో నన్ను చూడగలుగుదురో వారే నా ప్రియ భక్తులు. కాబట్టి నేనొకటి, జీవరాశి ఇంకొకటి అను ద్వంద్వ భావమును, భేదమును విడిచి నన్ను సేవింపుము".

10 వ అధ్యాయము:

      బాబా స్వాధీనమున అష్టసిద్ధులుండెను. బాబా వానిని అభ్యసించనూలేదు, కోరనూలేదు. వారు పరిపూర్ణులు గనుక అవి సహజముగా వారికలవడెను. సాయిబాబా నిజమైన శక్తిని కనుగొనలేనివారు, బాబాను సామాన్య మానవునిగా యెంచినవారు దురదృష్టవంతులని చెప్పవచ్చును. బాబా "మీకు యెవరైనా కీడు చేసినచో ప్రత్యపకారము చేయకుడు. ఇతరుల కొరకు మీరేమైనా చేయగల్గినచో ఎల్లప్పుడు మీరు మేలు మాత్రమే చేయుడు". సంగ్రహముగా యిదియే బాబా యొక్క బోధ. ఇది యిహమునకు, పరమునకు పనికివచ్చును. భగవంతుని కృపాకటాక్షము లేనిదే యోగుల చరిత్రలను వినుటకు మనస్సు అంగీకరించదు. యోగీశ్వరులు వారంతట వారు భూమిపై అవతరించెదరు. మన పూర్వజన్మ సుకృతముచే మనము సాయిబాబా పాదములను బట్టితిమి.

11 వ అధ్యాయము:

      పంచభూతములు బాబా స్వాధీనము. పూజింపదగిన విగ్రహము, యజ్ఞవేదిక, అగ్ని, వెలుతురు, సూర్యుడు, నీరు, బ్రహ్మము - వీటన్నిటి కంటె సద్గురువు ఉత్కృష్టుడు. అటువంటి సద్గురువు సాయి రూపంలో శిరిడీ గ్రామమునందు అవతరించెను.

12 వ అధ్యాయము:

      శిష్టులను రక్షించుటకు, దుష్టులను శిక్షించుటకు భగవంతుడు అవతరించును. కాని యోగుల కర్తవ్యము వేరు. వారికి మంచివాడును, చెడ్డవాడును ఒకటే. వారు దుర్మార్గులను కనికరించి సన్మార్గమున ప్రవర్తించునట్లు చేయుదురు. ఇటువంటి వారిలో సాయిబాబా ముఖ్యులు. వారి యిచ్చలేనిచో భక్తులు బాబా వద్దకు రాలేకుండిరి. ఒకవేళ అదృష్టవశమున భక్తులు బాబా వద్దకు వచ్చినా, బాబా సన్నిధిలో యుండవలెనని కోరినను, అచ్చట యుండలేకుండిరి. బాబా ఆజ్ఞ యెంతవరకు గలదో అంతవరకే వారు షిరిడీలో ఉండగలరు.

13 వ అధ్యాయము:

      "ఎవరైతే భగవంతుని ఆశ్రయించుదురో వారు భగవంతుని కృపవలన మాయనుండి తప్పించుకుందురు. ఎవరు అదృష్టవంతులో, ఎవరి పాపములు క్షీణించినవో వారు నా పూజ చేసెదరు. ఎల్లప్పుడు సాయి! సాయి! అని జపించినచో నిన్ను సప్తసముద్రములు దాటించెదను. పూజాతంతుతో నాకు పనిలేదు. భక్తియున్న చోటనే నా నివాసము. నన్ను విశ్వసింపుము. నీవు తప్పక మేలు పొందెదవు". బాబా తన భక్తుల వద్దనుండి ఏమియు కోరెడివారు గాదు. వారికి గావలసినది భక్తులు పొందే మేలును జ్ఞప్తియందుంచుకొనుట, మార్పులేని గట్టి నమ్మకము, భక్తియును. బాబాగారు ఔషధములు ఉపయోగించకుండ అనేక జబ్బులు నయము చేసెడివారు. బాబావారి వాక్కు, ఆశీర్వాదము అమోఘము. రామబాణము వంటివి.

14 వ అధ్యాయము:

      గతజన్మల పుణ్యము కొలది మనకు మానవజన్మ లభించినది. కాబట్టి దాని సహాయముతో భక్తినవలంబించి, దానివలన జన్మరాహిత్యమును పొందవలయును. బాబా సర్వజ్ఞులు అగుటవలన వారు షిరిడీలో ఉన్నప్పటికీ దూరములో ఏమి జరుగుచుండెనో వారికి తెలియుచుండెను. భక్తులకు దానము గురించి బోధించుటకు, ధనమునందు వారికి అభిమానము పోగొట్టుటకు బాబా దక్షిణ అడుగుచుండెను. బాబాగారి ఆస్తియంతయు ఒక కౌపీనము, ఒక విడి గుడ్డ, ఒక కఫినీ, ఒక తంబిరేకు గ్లాసు మాత్రమే. కాంతా, కనకాలయందు అభిమానము పోయినదని నిరూపించినపుడు బాబా ఆశీర్వాదము వలన మన పారమార్ధిక ప్రగతి శీఘ్రమగును, దృఢపడును.

15 వ అధ్యాయము:

      బాబా "నా ముందర భక్తితో మీ చేతులు చాపినచో వెంటనే రాత్రింబవళ్ళు మీ చెంతనే యుండెదను. శరీరముతో నేనిక్కడ యున్నప్పటికీ సప్తసముద్రములకవతల మీరు చేయుచున్న పనులు నాకు తెలియును. ప్రపంచమున మీ యిచ్చ వచ్చిన చోటుకి పోవుడు. నేను మీ చెంతనే యుండెదను. నా నివాస స్థలము మీ హృదయమునందే గలదు. నేను మీ శరీరములో వున్నాను. ఎల్లప్పుడు మీ హృదయమునందు, సర్వజన హృదయములందు నన్ను పూజింపుడు. ఎవ్వరు నన్ను ఈ విధంగా గుర్తించెదరో వారు ధన్యులు, పావనులు, అదృష్టవంతులు" అని బాబా నుడివెను.

      బాబా సర్వజ్ఞుడని నిరూపించుటకు, బాబాసాహెబ్ జోగ్ తో "ఈ అతిథి చోల్కరుకు టీ కప్పులో విరివిగా చక్కెర వేసి యిమ్ము" అనిరి. అలాగే ఒక భక్తుడు మసీదులో బల్లి కూతకు అర్థమేమని ప్రశ్నించగా, దాని చెల్లెలు దూర ప్రాంతము నుండి వచ్చియున్నదని చెప్పిరి.

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కి జై!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి