25, డిసెంబర్ 2010, శనివారం

శ్రీ సాయి సచ్చరిత్ర సారాంశము - శనివారము పారాయణము

శ్రీ సాయి సచ్చరిత్ర సారాంశము  
(శనివారము పారాయణము) 

మూలము: శ్రీ హేమాదు పంత్ చే రచింపబడి షిరిడీ సంస్థానము వారిచే ముద్రింపబడిన శ్రీ సాయి సచ్చరిత్రము నుండి.

క్లుప్తీకరణ: సి.హెచ్.కె.సూర్య ప్రకాశ రావు 
సాయి భక్తుడు 


16, 17 అధ్యాయములు:

      బ్రహ్మజ్ఞానమును పొందగోరి వచ్చినవానితో బాబాగారు "బ్రహ్మజ్ఞానము సంపాదించుట అంత సులభమైన పనికాదు. ముఖ్యముగా పేరాశ గలవానికి మిక్కిలి దుర్లభము. బ్రహ్మమును జూచుటకు 5 వస్తువులు సమర్పించవలయును. అవి ఏవన 1. పంచ ప్రాణములు  2. పంచేంద్రియములు  3. మనస్సు  4.బుద్ధి  5. అహంకారము. లోభికి శాంతిగాని, సంతుష్టి గాని, దృఢనిశ్చయముగాని ఉండవు".
       
      "నా ఖజానా నిండుగా ఉన్నది. ఎవరికేది కావలసిన దానిని వారికివ్వగలను. కాని వానికి పుచ్చుకొను యోగ్యత కలదా! లేదా! అని నేను మొదట పరీక్షించవలయును. నేను చెప్పినదానిని జాగ్రత్తగా విన్నచో నీవు తప్పక మేలు పొందెదవు. ఈ మసీదులో కూర్చొని నేనెప్పుడు అసత్యములు పలుకను". బాబాగారి విశిష్టత ఏమిటంటే ఆయన ఆత్మ సాక్షాత్కారము పొందిన యోగి అయినప్పటికి ప్రజలకై పాటుబడే వారిలో ప్రథమగణ్యులు.

18, 19 అధ్యాయములు:

      మానవుని పాపకర్మలు ముగియు వేళకు భగవంతుడు వానికొక యోగీశ్వరునితో కలసికొనుట సంభవింపజేయును. వారు తగిన సలహానిచ్చి భక్తుల క్షేమము చూసెదరు. అటువంటి యోగీశ్వరుడు సాయిబాబాగారు. మన అదృష్టము కొలది వారి పాదములకు చేరగలిగేము. బాబా గారు 2 పైసలు దక్షిణగా అడుగుచుండిరి. ఒక పైసా దృఢమైన విశ్వాసమునకు, రెండవది ఓపిక లేదా సహనమునకు.

బాబా సందేశము:

      మంత్రము గాని, ఉపదేశముగాని ఎవరి వద్దనుండి పొందుటకు ప్రయత్నించకు. నీ ఆలోచనలను, చేష్టలను నా కొరకే ఉపయోగించుము. నీవు తప్పక పరమార్థము పొందెదవు. నావైపు సంపూర్ణ హృదయముతో చూడుము. నేను నీవైపు అటులనే చూసెదను. నీ గురువునందు నమ్మకము, విశ్వాసము ఉంచుము. గురువును త్రిమూర్తుల అవతారమని ఎంచుము. వారు ధన్యులు. ఈ మసీదులో కూర్చొని నిజము తప్ప మరేమియు మాట్లాడను. ఆత్మ సాక్షాత్కారమునకు ధ్యానము అవసరము.

      ఏదైనా బంధము ఉండనిదే ఒకరు ఇంకొకరివద్దకు పోరు. ఎవరైన ధనముకొరకు నీ వద్దకు వచ్చినచో నీకిచ్చుటకు యిష్టము లేకున్నచో నీవు ఇవ్వనఖ్ఖరలేదు. వానిపై కుక్కవలె మొరగవద్దు. యితరులు నిన్ను ఎంతగా నిందించినను నీవు కఠినముగా జవాబు యివ్వకుము. అట్టి వానిని నీవు ఎల్లప్పుడూ ఓర్చుకొనినచో నిశ్చయముగ నీకు సంతోషము కల్గును.


      నీకు నాకు మధ్యగల గోడను నిర్మూలించుము. ఎవరైతే తమ జీవిత పరమావధిని పొందెదరో వారు అమరులై సుఖముగా నుండెదరు. తక్కిన వారందరూ పేరునకే ఊపిరి సలుపు వరకు మాత్రమే బ్రతికెదరు. యితరులను నిందించిన నీకు తోడ్పడదు. ఆత్మ సాక్షాత్కారమునకు సాధ్యమైనంత పాటుపడవలెను. ఎంత కృషి చేసిన అంత మేలు.


   తన కర్తవ్య కర్మలు చేయుచు భగవంతునికి సర్వస్వ శరణాగతి చేయవలయును. వారు దేనికి భయపడనవసరము లేదు. ఎవరైతే భగవంతుని పూర్తిగా నమ్మెదరో వాని లీలలు విని యితరులకు చెప్పెదరో యితర విషయములు ఏమియు ఆలోచించరో వారు తప్పక ఆత్మ సాక్షాత్కారము పొందుదురు.


      ఒకరి కష్టము యింకొకరు ఉంచుకొనరాదు. కష్టపడు వాని కూలి సరిగాను, దాతృత్వముతోను ధారాళముగా యివ్వవలెనని బాబా చెప్పెను.

20 వ అధ్యాయము:

      మౌలికముగా సాయి నిరాకారుడు. భక్తుల కొరకు ఆకారమును ధరించెను. కష్టసుఖములు అను భావములు మన మనోవైఖరిపై ఆధారపడి యుండును. ఉపనిషత్తులలోని నీతి ప్రకారము ఉన్నదానితో సంతృష్టి చెందుము. ఏది మనకు సంభవించుచున్నదో అది అంతయు భగవంతుని ఆజ్ఞతో సంభవించుచున్నది. తుదకది మన మేలుకొరకేయని గ్రహించవలయును. యింకొక నీతి ఏమన, మనుష్యుడు ఎల్లప్పుడు తనకు విధింపబడిన కర్మలను చేయుచుండవలయును. కర్మ చేయకుండుట ఆత్మ నాశనమునకు కారణము.

21 వ అధ్యాయము:

      భగవంతుని ఆదేశానుసారము యోగులు అనేకచోట్ల అవతరించెదరు. వారు చేయు పనులు ఒకరు చేయునది ఇంకొకరికి తెలియును. ఒకరు చేసినదానిని ఇంకొకరు పూర్తి చేయుదురు. బాబా గారు వి.కె.ఠాకూరు తో "ఈ ఆధ్యాత్మిక మార్గము మిగుల కఠినమైనది. కావలసినంత కృషి చేయవలయును. ఆశీర్వాదము లేని ఉత్త పుస్తక జ్ఞానము ప్రయోజనము లేనిది. చదివినంతయు ఆలోచించి ఆచరణలో పెట్టవలయును" అనిరి.


      అనంతరావు పాటిలు తో, "భక్తి లేని సాధనములన్నియు అనగా జపము, తపము, యోగము, మతగ్రంధ పారాయణము, వానిలోని సంగతులను ఇతరులకు బోధించుట నిష్ప్రయోజనము" లనిరి.


      పండరీపురం ప్లీడరు తో, "ప్రజలెంత టక్కరులు. వారు పాదములందు బడెదరు. దక్షిణ యిచ్చెదరు. చాటున నిందించెదరు" అని బాబాగారు ఉపదేశించిరి.

22 వ అధ్యాయము:

      బాబా గారు "నా ప్రకాశమును చూడవలెనంటే అహంకారమును విడిచి మిక్కిలి అణకువతో చూపుడువ్రేలుకు, మధ్యవ్రేలుకు మధ్యనున్న బొటనవ్రేలుపై దృష్టిని సారించినచో నా ప్రకాశము చూడగలరు. యిది భక్తికి సులభమైన మార్గము" అనేవారు.


      షిరిడీలో గల ద్వారకామాయి తల్లి వంటిది. ఎవరికైతే ఒక్కసారి ద్వారకామాయి (తల్లి) తొడపై కూర్చొనెదరో వారిని ద్వారకామాయి కష్టములనుండి తప్పించును. ఆనందమును కల్గించును అని నుడివిరి.


      బాబా గారి అభిప్రాయము:  "మనము అన్ని జీవులను ప్రేమించవలయును. ఎవరూ, ఎవరినీ, ఏమీ చేయలేరు. ఎవ్వరునూ స్వతంత్రులు కారు. భగవంతుడు సకల జీవులందు నివసించుచున్నాడు. దేనికైనా భగవదాజ్ఞ అవసరము".

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి