23, డిసెంబర్ 2010, గురువారం

శ్రీ సాయి సచ్చరిత్ర సారాంశము - గురువారము పారాయణము

శ్రీ సాయి రామచంద్రాయ నమః 
శ్రీ సాయి సచ్చరిత్ర సారాంశము  
(గురువారము పారాయణము) 
మూలము: శ్రీ హేమాదు పంత్ చే రచింపబడి షిరిడీ సంస్థానము వారిచే ముద్రింపబడిన
శ్రీ సాయి సచ్చరిత్రము నుండి.
 క్లుప్తీకరణ: సి.హెచ్.కె.సూర్య ప్రకాశ రావు 
సాయి భక్తుడు

ఉపోద్ఘాతము:

      శ్రీ సాయిబాబా సద్గురువు. త్రిమూర్తి స్వరూపుడు. సర్వజ్ఞుడు. శరణాగత రక్షకుడు. యోగీశ్వరుడు. "ఎవరైతే బాబా షిరిడీ లోనే ఉన్నారని అనుకుందురో, వారు బాబాను నిజముగా గ్రహింపలేదని భావింపుము" అని బాబా అనిరి.
ప్రార్థన:

      మనమిప్పుడు సాయిబాబా కు సాష్టాంగ నమస్కారము చేసి వారి పాద పద్మములను బట్టుకొని సర్వజనుల కొరకు ఈ క్రింది ప్రార్థన చేసెదము.  "మా మనస్సు అటు నిటు సంచారము చేయకుండు గాక! మా మనసు నిన్ను తప్ప మరేమియు కొరకుండు గాక! ఈ సచ్చరిత్రము ప్రతి గృహము యందుండు గాక! దీనిని ప్రతి నిత్యమూ పారాయణము చేసెదము గాక! ఎవరైతే దీనిని నిత్యమూ పారాయణ చేసెదరో వారి ఆపదలు తొలగిపోవు గాక! 

బాబా సందేశము:

      మీరెక్కడ ఉన్నప్పటికీ , ఏమి చేసినప్పటికీ నాకు తెలియునని  బాగుగా జ్ఞాపకముంచుకొనుడు.  నేనందరి హృదయములను పాలించువాడను. అందరి హృదయములలో నివసించువాడను. నేను ప్రపంచము నందుగల చరాచర జీవకోటిని ఆవరించి యున్నాను.  ఈ జగత్తును నడిపించు వాడను, సూత్ర ధారిని నేనే. ఎవరైతే తమ దృష్టిని నా వైపు త్రిప్పెదరో, వారికి ఏ హాని, బాధ కలుగదు. ఎవరైతే నన్ను మరచెదరో వారిని మాయ శిక్షించును. పురుగులు, చీమలు, దృశ్యమాన చరాచర జీవకోటియంతయు నా శరీరమే. నా రూపమే.

1 వ అధ్యాయము:

      జ్ఞానోదయమునకు గాని, ఆత్మ సాక్షాత్కారమునకు గాని మొట్ట మొదట పాపములను, కోరికలను తుడిచి వేయవలయును. అటు పిమ్మట త్రిగుణ రాహిత్యమును పొందవలయును. అహంకారము చంపుకొన వలయును.

2 వ అధ్యాయము:

      ఎవరైతే తన అహంకారమును నా పాదములపైని విడిచి పెట్టుదురో, వారికే నేను మిక్కిలి సహాయ పడెదను.

3 వ అధ్యాయము:

       మనస్సు నిలకడగా ఉంచుము. నా మాటలయందు విశ్వాసముంచుము. నా లీలలు వ్రాసినచో అవిద్య నిష్క్రమించును. దానిని శ్రద్ధ, భక్తులతో ఎవరు వినెదరో, వారికి ప్రపంచమందు మమత క్షీణించును. బలమైన భక్తి, ప్రేమ కెరటములు లేచును. ఎవరైతే నా లీలలలో మునిగెదరో, వారికి జ్ఞాన రత్నములు లభించును. ఎవరైతే నన్ను శరణాగతిని వేడెదరో, నన్ను భక్తి విశ్వాసములతో పూజించెదరో, నన్నే స్మరించెదరో, నా ఆకారమును మనసున నిలిపెదరో వారిని బంధనముల నుండి తప్పించుట నా ముఖ్య లక్షణము. "సాయి! సాయి!" యను నామమును జ్ఞప్తి యందుంచుకున్నంత మాత్రమున చెడు పలుకుట, వినుట వలన కలుగు పాపములు నశించును.  

4 వ అధ్యాయము:

      భగవద్గీత చతుర్దాధ్యాయములో  7, 8 శ్లోకములందు శ్రీ కృష్ణ పరమాత్మ సెలవిచ్చునట్లు "ధర్మము నశించునపుడు, అధర్మము వృద్ది పొందునపుడు సన్మార్గులను రక్షించుటకు, దుర్మార్గులను శిక్షించుటకు ధర్మ సంస్థాపన కొరకు యుగ యుగములందు భగవంతుడు గాని, భగవంతుని ప్రతినిధులగు యోగులు, సన్యాసులు అవసరం వచ్చినపుడల్లా అవతరించి కర్తవ్యమును నిర్వర్తించెదరు.  అటువంటి యోగులలో యోగీశ్వరుడు శ్రీ షిరిడీ సాయి నాథుడు. బాబా ఎల్లప్పుడూ "అల్లా మాలిక్", అనగా "అల్లాయే యజమాని" అనెడివారు. వారు 7 రోజులు రాత్రింబవళ్ళు నామ స్మరణ చేయుచుండెడి వారు. దీనినే "నామ సప్తాహము" అందురు.

      బాబా దాసగణు తో "స్నానమునకు ప్రయాగ క్షేత్రము వెళ్లనవసరము లేదు. ఆ గంగా యమునలు ఇక్కడే ఉన్నాయి", అని తన రెండు పాదముల బొటన వ్రేళ్ళ నుండి గంగా-యమునల జలములను కాలువలుగా పారించెను. బాబా షిరిడి లో తాను కూర్చున్న స్థలము తన గురుస్థానమనియు, గురువు గారి సమాధి అక్కడ గలదనియు, దానిని కాపాడవలెననియు చెప్పెను.

5 వ అధ్యాయము:  

       బాబా భాయికృష్ణాజీ తో "అక్కల్ కోటలో ఏమున్నది? అక్కడికేల పోయేదవు?  అక్కడ ఉండే మహారాజు ఇక్కడనే ఉన్నారు. వారు నేనే" అని అనిరి. సాయిబాబా యోగి పుంగవుడు అని బయటి ప్రపంచానికి  తెలియుటకు చాంద్ పాటిల్ అను ధనికుని తప్పి పోయిన గుర్రమును చూపించి ఆశ్చర్య పరచెను. అటులనే మొట్ట మొదట భక్త మహాల్సాపతి బాబా బండి నుండి ఖండోబా దేవాలయం దగ్గర దిగుట చూసి "దయచేయుము సాయీ" అని స్వాగతించెను. అది మొదలు బాబా "సాయిబాబా" గా ప్రఖ్యాతులైరి.

6 వ అధ్యాయము:

       భగవంతుని ఎరుగుటకు కర్మ, జ్ఞాన, యోగ, భక్తి అని నాలుగు మార్గములు కలవు. అన్నింటిలో భక్తి మార్గము కష్టతరమైనది. దాని నిండా ముళ్ళు, గోతులు ఉండును.  సద్గురువుల సహాయముతో ముండ్లను, గోతులను తప్పించుకొని నడచినచో గమ్య స్థానము అవలీలగా చేరవచ్చును. దీనిని గట్టిగా నమ్మమని సాయిబాబా చెప్పుచుండెను. నా భక్తుని ఇంటిలో అన్న వస్త్రములకు ఎప్పుడూ లోటుండదు. మనస్సు చంచలముగా ఉన్నచో ఏకాగ్రత లేనట్టే.
      బాబాకు అన్నదానమనిన చాల ప్రీతి. ఉప్పునీటి బావిలో పువ్వులు వేసి మంచి నీళ్ళుగా మార్చెను. బాబాకు సర్వ మతములు ఒక్కటే. దీనికి ఉదాహరణ శ్రీ రామ నవమి నాడు షిరిడీ లో పగలు హిందువులు శ్రీ రామ నవమి ఉత్సవము, రాత్రులందు మహమ్మదీయులు చందన ఉత్సవము జరుపుకొనుచుండిరి.

7 వ అధ్యాయము:

      బాబా కొలిమిలో చేయి పెట్టి కమ్మరి యొక్క బిడ్డను రక్షించెను. అప్పుడు బాబా "నా చేయి కాలుట నాకంత బాధాకరము గాదు. కాని నా బిడ్డ రక్షింపబడెను అను విషయము నాకు ఆనందము కల్గజేయుచున్నది" అని నుడివెను. ఖాపర్డే కుర్రవాని ప్లేగు జాడ్యము బాగుచేయదలచి తాను నాలుగు పెద్ద ప్లేగు పొక్కులను అనుభవించి అప్పుడు బాబా "చూచితిరా! నా భక్తుల కొరకు నేనిట్లు బాధ పడెదను. వారి కష్టములన్నియు నావిగానే భావించెదను" అని నుడివెను.  సాయిబాబాకు జాతి, మతములతో ఎట్టి సంబంధము లేదు. వారు సర్వజ్ఞులు.  అయినప్పటికీ ఏమీ తెలియని వానివలె కన్పించుచుండిరి.

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై !

4 కామెంట్‌లు:

 1. Hi,

  I have created a Page in Face Book for our beloved deity and would request you all to visit the same. the link for the page is as follows :-

  http://www.facebook.com/pages/Shiridi-Sai-Satchidanada-Sadguru-Sainath-Maharaj-Ki-Jai/159663637412924?v=wall

  Also, if you could kindly post this Sai Satcharitra saransamu link it would help a lot of devotees as well.

  Sai Ram,

  Phani

  రిప్లయితొలగించండి
 2. సర్ మీ సాయి సచ్చరిత ప్రయత్నము బాగుందండి. సాయి భక్తులకు ఇది శుభ వార్తే. సర్ నేను కూడా ఒక devotional సైట్ ను రన్ చేస్తున్నాను. మీకు ఇబ్బంది లేకుంటే మీ పోస్టులు నాకు మెయిల్ చెయ్యగలరా.
  మీ ఫోన్ నంబర్ లేదా ఈ - మెయిల్ id నాకు ఇవ్వగలరా?
  నమస్కారములతో !
  మీ రాయప్రోలు మల్లికార్జున శర్మ
  హైదరాబాద్.
  e-mail : mallikarjunasharma@gmail.com

  రిప్లయితొలగించండి
 3. ఫణి గారికి, శర్మ గారికి ధన్యవాదాలు. ఈ పారాయణము ముగిసిన పిమ్మట ఈ లింకులను పోస్టుచేయగలను.

  రిప్లయితొలగించండి