29, డిసెంబర్ 2010, బుధవారం

శ్రీ సాయి సచ్చరిత్ర సారాంశము - బుధవారము పారాయణము


శ్రీ సాయి సచ్చరిత్ర సారాంశము  
(బుధ వారము పారాయణము) 
మూలము: శ్రీ హేమాదు పంత్ చే రచింపబడి షిరిడీ సంస్థానము వారిచే ముద్రింపబడిన శ్రీ సాయి సచ్చరిత్రము నుండి.
క్లుప్తీకరణ: సి.హెచ్.కె.సూర్య ప్రకాశ రావు 
సాయి భక్తుడు 


45వ అధ్యాయము:

          బాబా మన దృష్టినుండి మరణించెను. కాని వారి యనంత శక్తి లేదా సాయి స్వరూపము ఎల్లప్పుడునూ నిలిచియే యుండును. అప్పుడే కాదు యిప్పుడు కూడ కావలసినది బాబాయందు హృదయపూర్వకమైన భక్తి. మన బుద్ధి, యింద్రియములు, మనస్సు బాబా సేవలోనైక్యము కావలయును. జీవిత పరమావధిని పొందుటకు తండ్రిగాని, తల్లిగాని, సోదరులు గాని, బంధువులు గాని తోడ్పడరు. ఆత్మ సాక్షాత్కారమునకు దారిని మనమే వెదుకుకొని ప్రయాణము సాగించవలయును. కలియుగములో మోక్షము పొందుటకు ఒక్కటే మార్గము కలదు. అదే మన గురుని లేదా హరి పాదారవిందములను స్మరించుట. గురు స్మరణ మనకు శాశ్వత ఆనందమును కలుగజేయును. "మంచిగాని, చెడ్డగాని ఏది మనదో అది మన దగ్గర యున్నది. ఏది యితరులదో అది యితరుల వద్ద ఉన్నది" అని బాబా మహల్సాపతితో అనెను.

46వ అధ్యాయము:

          ప్రస్తుతము బాబా రూపము అగోచరమైనప్పటికి భక్తులు బాబాయందే నమ్మకముంచినచో వారు సమాధి చెందకముందు చేసిన లీలలను అనుభవించెదరు. బాబా భక్తుని ఎవరినైననూ ఆమోదించినచో రాత్రింబవళ్ళు భక్తుని చెంతనే యుండి, యింటివద్దనుగాని, దూరదేశమునగాని బాబా వెంబడించుచుండును. భక్తుడు తన యిష్టము వచ్చినచోటుకు పోయినయెడల బాబా అచ్చటకు భక్తునికంటె ముందుగా బోయి ఏదో ఒక ఊహించరాని రూపమున ఉండును. రెండు మేకల కథను బట్టి బాబాకు జంతువులపైన కూడ అపారమైన ప్రేమయని తెలియుచున్నది.

47వ అధ్యాయము:

          శ్రీ సాయి ముఖము పావనమైనది. ఒక్కసారి వారివైపు దృష్టి నిగిడించినచో ఎన్నో జన్మల విచారమును నశింపజేసి ఎంతో పుణ్యములను ప్రాప్తించునటులజేయును. వారి దయాదృష్టి మనపై బరపినచో మన కర్మ బంధములు వెంటనే విడిపోయి మనమానందము పొందెదము. గత జన్మలో చేసినదాని ఫలము ఈ జన్మలో అనుభవించి తీరవలయును. దానిని గూర్చి దుఃఖించినచో ప్రయోజనము లేదు. భగవంతుడు ఆపద సమయమందు భక్తుల రక్షించుటకై వారి వద్దకు పరుగెత్తును. దీనికి సంబంధించిన కథ వీరభద్రప్ప-చెన్న బసవప్ప (పాము-కప్ప కథ)

నీతి: ఈ కథవలన మనము నేర్చుకొనిన నీతి యేమనగా ఎవరు చేసిన దానిని వారే అనుభవించవలయును. ఇతరులతో గల సంబంధములు బాధలను కూడ అనుభవింపజేయును. తప్పించుకొను సాధనము లేదు. తనకెవరితోనైన శతృత్వమున్న దాని నుండి విముక్తి పొందవలెను. ఎవరికైన ఏమైన బాకీయున్న తీర్చివేయవలయును. ఋణముగాని, శతృత్వ శేషముగాని యున్నచో తగిన బాధపడవలయును. ధనమునందు పేరాశ గలవానికి అది హీనస్థికి తెచ్చును. తుట్టతుదకు వానికి నాశనము కల్గజేయును.

48వ అధ్యాయము:

సద్గురుని లక్షణములు:

          ఎవరైతే చక్కని సంభాషణల వలన మనకు యిహపర సుఖములందు విరక్తి కలుగజేసెదరో; ఎవరు ఆత్మ సాక్షాత్కారమునందు మనకు అభిరుచి కల్గునట్లు జేసెదరో; ఎవరైతే ఆత్మ సాక్షాత్కార విషయమున పుస్తక జ్ఞానమేగాక, ఆచరణయందు అనుభవము కూడ పొందియున్నారో అట్టివారు సద్గురువులు.
సద్గురుని ముఖ్య లక్షణము: వారు శాంతమునకు ఉనికిపట్టు. వారు ఎప్పుడు చాపల్యముగాని, చికాకుగాని చెందరు. తమ పాండిత్యమునకు వారు గర్వించరు. ధనవంతులు, పేదలు, ఘనులు, నీచులు వారికి సమానమే. అటువంటి సద్గురువు శ్రీ షిరిడీ సాయిబాబా.

          అందుచే భక్తులు చేయవలసిన పని భక్తి-విశ్వాసము లనెడి హృదయదీపమును సరిచేయవలయును. ప్రేమ అను వత్తిని వెలిగించవలయును. ఎప్పుడిట్లు చేసెదరో అప్పుడు జ్ఞానమనే జ్యోతి (ఆత్మ సాక్షాత్కారము) వెలిగి ఎక్కువ తేజస్సుతో ప్రకాశించును. యదార్థమైన కాంక్ష, ఉత్తమమైన భావములు ఉన్నచోటనే భగవంతుడు తానై సాక్షాత్కరించును. అదియే ప్రేమ. అదే మోక్షమునకు మార్గము.

          శ్రీ సాయిబాబా భౌతిక శరీరముతో ఉన్నప్పుడు తమ భక్తులకు ఏ అనుభవములు యిచ్చుచుండిరో, అటువంటి అనుభవములు యిప్పుడు కూడ సంపూర్ణ విశ్వాసము గల భక్తులు అనుభవించుచున్నారు.

49వ అధ్యాయము:

          తీర్థయాత్ర, వ్రతము, త్యాగము, దానముల కంటె తపస్సు చేయుట గొప్ప. హరిని పూజించుట తపస్సుకంటె మేలు. సద్గురుని ధ్యానించుట అన్నిటికంటె మేలయినది. మన కర్తవ్యమును మనము చేయగల్గినచో సాయి సద్గురువు తప్పనిసరిగా మనకు సహాయము చేయును. తుదకు మోక్షమునిచ్చును. బాబా గారు ఒకసారి నానాతో, అనవసరముగా చికాకు పడుచుంటివేల. ఇంద్రియములను వాటి పనులను చేయనిమ్ము. వానితో మనము జోక్యము కలుగజేసికొన కూడదు. దేవుడు ఈ సుందరమైన ప్రపంచమును సృష్టించియున్నాడు. అందరిని చూసి సంతసించుట మన విధి. మన హృదయము స్వఛ్చముగా యున్నంతవరకు ఏమియు దోషములేదు. మనలో చెడ్డ ఆలోచనలు లేనప్పుడు యితరులకు భయపడనేల. నేత్రములు వాని పని అవి నెరవేర్చుకొనవచ్చును. నీవు సిగ్గుపడి బెదరనేల. "బాహ్యేంద్రియములనే స్వాధీనమునందుంచుకొని మనస్సును విషయముల వైపు పరుగిడ నిచ్చినచో వానిపై అభిమానము ఉండనిచ్చినచో చావు-పుట్టుకల చక్రము నశింపదు".

50వ అధ్యాయము:

          సాయిబాబా కథలు మనకు ఊరటను, సుఖశాంతులను కలుగజేయును. సాయి కథలు చెప్పువారును, వినువారును ధన్యులు, పావనులు. చెప్పువారి నోరును, వినువారి చెవులును పవిత్రములు. బాబా భక్తులతో మంచిగాని, చెడ్డగాని చేయుటకు నీవు కర్తవని అనుకొనరాదు. గర్వ, అహంకార రహితుడవై యుండవలయును. అంత్య కాలమున నిన్ను విమానములో తీసుకొని పోయెదను. భక్తుడు తనవాడు కానిచో తనచే ఆకర్షించబడడనియు, వాడు తన దర్శనమే చేయలేడనియు చెప్పుచుండెను.

51వ అధ్యాయము: (శ్రీ సాయి సచ్చరిత్ర లోని 52, 53 అధ్యాయము లిందు 51 వ అధ్యాయముగా పరిగణించ వలెను)

ఇవియే చివరి అధ్యాయములు. హేమాద్‍పంత్ ఉపసంహార వాక్యములు. సద్గురు సాయి యొక్క గొప్పదనము. శ్రీసాయి సమర్థునికి సాష్టాంగ నమస్కారముజేసి వారి ఆశ్రయమును పొందెదరు. వారు జీవ, జంతువులయందును, జీవములేని వస్తువులయందును వ్యాపించియున్నారు. వారినే జ్ఞప్తియందుంచుకొని, వారిని శరణు పొందినచో వారు మన కోరికలనన్నిటిని నెరవేర్చి మనము జీవిత పరమావధిని పొందునట్లు చేసెదరు. ఈ సంసారమనే మహాసముద్రమును దాటుట మహా కష్టము. ఈ మహాసముద్రమును దాటుటకు సద్గురువు సాయి నావ వంటివారు. వారు మనలను సురక్షిరముగా దాటించెదరు.

శ్రీసాయినాథుని ఏకాదశ సూత్రములు:

1.  శిరిడి ప్రవేశమే సర్వ దుఃఖ పరిహారము.
2.  ఆర్తులైననేమి, నిరుపేదలైననేమి ద్వారకామాయి ప్రవేశమొనరించినంతనే సుఖసంపదలందగలరు.
3.  ఈ భౌతిక దేహానంతరము సైతము నేను అప్రమత్తుడనే.
4.  నా భక్తులకు రక్షణము నా సమాధినుండియే వెలువడును.
5.  సమాధి నుండియే సర్వకార్యములు నిర్వహింతును.
6.  సమాధి నుండి నా మానుష శరీరము మాట్లాడును.
7.  నన్ను ఆశ్రయించు వానిని, శరణుజొచ్చిన వానిని నిరంతరము రక్షించుటయే నా కర్తవ్యము.
8.  నాయందు ఎవరికి దృష్టి కలదో వారియందే నా కటాక్షము.
9.  మీ భారములను నాపై బడవేయుడు. నేను మోసెదను.
10. నా సహాయముగాని, సలహానుగాని కోరిన తక్షణమే యొసంగెదను.
11. నా భక్తుల గృహములందు లేమి అను శబ్దము పొడసూపదు.

ఫలశృతి:

          ఈ గ్రంథమును పారాయణ చేసినచో గల్గు ఫలితమును గూర్చి కొంచెము చెప్పుదుము. జనన మరణములనే చక్రము నుండి తప్పించుకొనవలెనన్నచో సాయి కథలను చదువుము. దాని నెల్లప్పుడును జ్ఞప్తి యందుంచుకొనుము. వారి పాదములనే ఆశ్రయించుము. వానినే భక్తితో పూజించుము.

          శ్రీసాయి సగుణ స్వరూపమునే ధ్యానించినచో క్రమముగా అది నిష్క్రమించి ఆత్మ సాక్షాత్కారమునకు దారి చూపును. భక్తుడు బాబాను సర్వస్య శరణాగతి వేడినచో అతడు తాను అను దానిని మరచిపోయి, నది సముద్రములో కలియునట్లు భగవంతునిలో ఐక్యమగును.

          స్నానము చేసిన పిమ్మట ఎవరు దీనిని భక్తి, ప్రేమలతోను, పూర్తి నమ్మకముతోను పారాయణ చేసి వారము రోజులలో ముగింతురో వారి ఆపదలన్నియు నశించగలవు. కేంద్రీకరించిన మనస్సుతో ప్రతిరోజు ఒక అధ్యాయము పారాయణము చేసినచో అదియు అపరిమితానందమును కలుగజేయును. నీ హృదయమునందు శ్రీ సాయి చరణములనే నమ్మినయెడల భవసాగరమును సులభముగా దాటగలవు. వారి వారి భక్తి, నమ్మకములపై ఫలమాధారపడి యున్నది.

ప్రసాద యాచనము:

          ఈ గ్రంథమును సర్వ శక్తిమయుడైన భగవంతుని ప్రార్థనతో ముగించెదము. కారుణ్యము జూపుమని వారిని వేడెదము. ఈ గ్రంథమును చదువు భక్తులు హృదయ పూర్వకమగు సంపూర్ణ భక్తి శ్రీ సాయి పాదములందు పొందెదరుగాక. సాయి సగుణ స్వరూపము వారి నేత్రములందు నిలిచిపోవును గాక! వారు శ్రీ సాయిని సర్వ జీవములందు చూచెదరుగాక! తథాస్తు!

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కి జై!

శ్రీ సాయి సచ్చరిత్ర సారాంశము సర్వము సంపూర్ణము.
శ్రీ సాయి కటాక్షము చేత వ్రాయుట సిద్ధించినది.
తల్లిదండ్రులకు అంకితము. నేను నిమిత్త మాత్రుడను

సాయి భక్తుడు
సి.హెచ్.కె.సూర్యప్రకాశ రావు
విశాఖపట్నం
కేంప్: యుఎస్‍ఎ, నార్త్ కరోలినా స్టేట్, మోరిస్‍విల్, తేదీ. 25 జూలై 2010.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి