28, డిసెంబర్ 2010, మంగళవారం

శ్రీ సాయి సచ్చరిత్ర సారాంశము - మంగళవారము పారాయణము


శ్రీ సాయి సచ్చరిత్ర సారాంశము  
(మంగళ వారము పారాయణము) 
మూలము: శ్రీ హేమాదు పంత్ చే రచింపబడి షిరిడీ సంస్థానము వారిచే ముద్రింపబడిన శ్రీ సాయి సచ్చరిత్రము నుండి.
క్లుప్తీకరణ: సి.హెచ్.కె.సూర్య ప్రకాశ రావు 
సాయి భక్తుడు 


38వ అధ్యాయము:

      శ్రీసాయి సద్గురువు. పావనమూర్తి. శరణుజొచ్చిన వారిని పోషించి రక్షించెదరు. బాబా స్వయముగా తన చేతులతో వంటచేసి ఎవరు శాఖాహారులో వారికి శాఖాహారము, ఎవరు మాంసాహారులో వారికి మాంసాహారమును పెట్టువారు. బాబాగారు అన్నము వండునపుడు చేయిపెట్టి కలుపుచుండెడివారు. అయినను చేయి కాలునది కాదు. కృతయుగములో తపస్సు, త్రేతా యుగములో జ్ఞానము, ద్వాపర యుగములో యజ్ఞము, కలియుగములో దానము, భగవన్నామస్మరణ చేయవలెనని శాస్త్రములు ఘోషించుచున్నవి. దానములన్నింటిలో అన్నదానమే శ్రేష్టమైనది. ఆహారమే పరబ్రహ్మ స్వరూపము.

      బాబా దేవాలయములను, దేవతలను ఏమాత్రము అగౌరవపరచినను ఊరుకొనెడివారు కాదు. షిరిడీ గ్రామములోని హిందూ దేవాలయములన్నిటిని మరమ్మత్తు చేయించుచుండిరి. బాబాను కొందరు హిందువులని, కొందరు మహమ్మదీయులని భావించుచుండెడివారు. నిజముగా బాబా ఏ జాతికి, మతమునకు చెందినవారు కాదు. వారు ఎప్పుడు పుట్టితిరో, వారి తల్లిదండ్రులెవరో ఎవరికి తెలియదు.

కాలా (మిశ్రమము):

      భక్తులు తెచ్చిన ప్రసాదములన్నియు ఒక్క పాత్రలో వేసి బాబాకు సమర్పించి తదుపరి భక్తులు ప్రసాదముగా స్వీకరించుచుండిరి.

      బాబాగారు తాను త్వరలో సమాధి చెందుదురని తెలిసికొని హేమాద్‍పంతుకు ఒక గిన్నెడు మజ్జిగ యిచ్చి త్రాగించెను. దీనిని బట్టి బాబా సర్వజ్ఞుడని తెలియుచున్నది. చదువరులతో హేమాద్ పంతునకు మనము నిజముగా నమస్కరించవలెను. అతడు గిన్నెడు మజ్జిగ ప్రసాదముగా త్రాగి, మనకు కావలసినంత అమృతమును బాబా లీలలు రూపముగా నిచ్చెను. మనము ఈ అమృతమును గిన్నెలతో త్రాగి సంతుష్టిచెంది ఆనందించెదము గాక.

39వ అధ్యాయము:

      షిరిడీ వలె ద్వారకామాయి పావనమైనది. ఏలనన సాయి అచట నివసించును. తిరుగుచు, మసలుచు అక్కడనే మహాసమాధి పొందిరి. బాబా తనకు సంస్కృతము తెలియదని భావించిన నానా అను భక్తునకు గర్వము అణుచుటకు భగవద్గీత 4వ అధ్యాయము, 34వ శ్లోకము "తద్విద్ధి ప్రణిపాతేన, పరిప్రశ్నేన సేవయా, ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వ దర్శినః" అన్న శ్లోకమునకు అర్థము సవివరముగా తెలియజేసెను.

      సేవయనగా యిష్టమున్నచో చేయవచ్చును, లేనిచో మానవచ్చును అనే అభిప్రాయముతో చేయునది సేవకాదు. శరీరము తనది కాదనియు, దానికి తాము యజమాని కాదనియు, శరీరము గురువుగారిది అనియు, వారి కొరకే సేవచేయుటకు శరీరమున్నదనియు భావింపవలెను. ఇక్కడ గురువుగారు అంటే భగవంతుడు అని భావము. సద్భక్తుడు సర్వస్వమును వాసుదేవమయముగా భావించును.

సమాధి మందిర నిర్మాణము:

      బాబా తాను చేయ నిశ్చయించిన పనులను గూర్చి ఎప్పుడును ముందుగా మాట్లాడువారు కాదు. కోటీశ్వరుడగు శ్రీమాన్ బాపూసాహెబ్ బూటీ మరియు భక్తుడగు శ్యామా కలసి షిరిడీలో విశాలమైన మందిరమును నిర్మించి మురళీధరుని విగ్రహమును ప్రతిష్ట చేయవలెనని తలంచి ఈ విషయము బాబాగారికి తెలియజేయగా, సర్వాంతర్యామియైన బాబా "దేవాలయము పూర్తి కాగానే నేనే అచ్చట నివసించుటకు వచ్చెదను" అని చెప్పెను. పూర్తి అయిన తర్వాత మనమే దానిని ఉపయోగించుకొనవలయుని అనిరి. బాబావారి జీవితలోతును కనుగొన శక్యము ఎవరి తరమూ కాదు.

      బాబా గారు అస్వస్థులై సమాధి చెందక ముందు "నన్ను రాతి మందిరములో ఉంచుడు" అన్న పల్కులు, తానే మురళీధరుడని తెలియజేయుచున్నవి. మురళీధరునకు సంబంధించిన స్థలమునందు బాబాను మహాసమాధి చేయుటచే బాబాయే మురళీధరుడనియు, బూటీవాడాయే సమాధి మందిరమనియు అర్థము గ్రహించవలయును.

40వ అధ్యాయము:


      వర్షాకాలములో నదులు సముద్రమునందు కలియునటుల బాబా భక్తులతో కలసి తమ శక్తిని శిష్యులకిచ్చును. బాబా "నన్నే గుర్తుంచుకొను వారిని నేను మరువను. నాకు బండిగాని, రైలు గాని, టాంగాగాని, విమానము గాని అవసరము లేదు. నన్ను ప్రేమతో పిలుచు వారియొద్దకు నేను పరుగెత్తి పోయి ప్రత్యక్షమయ్యెదను" అనిరి. భక్తులు సంపూర్ణముగా సద్గురువును శరణు వేడినచో సద్గురువు తమ భక్తుల యిండ్లలో శుభకార్యములను సవ్యముగా నెరవేరునట్లు జూచెదరు.

41వ అధ్యాయము:

      ఎవరికైతే ఆధ్యాత్మిక విషయములలో ఎక్కువ శ్రద్ధయో వారిని బాబా ప్రేమించుటయే గాక వారి కష్టములను తొలగించి వారిని ఆనందభరితులుగా జేయుదురు. బాబాగారు సర్వహృదయ నివాసుడు. తన గురించిగాని, యితరుల గురించిగాని, ఏ విషయమైనా తెలుసుకోవాలని భక్తులు యితరులను ప్రశ్నించునపుడు బాబా గార్కి వారి నైజము నచ్చదు. ఏదైనా అడగాలని ఉంటే, నేనుండగా, యితరులను ఎందుకు అడుగుతావు అనేవారు.

42వ అధ్యాయము:

బాబా సమాధి చెందుట:

    సద్గురుని పాదారవిందములను జ్ఞప్తియందుంచుకొనినచో మన కష్టములు నశించును. మరణము దాని నైజమును కోల్పోవును. ఐహిక దుఃఖములు నశించును. ఎవరైతే తమ క్షేమమును కోరెదరో వారు శ్రీ సాయి లీలలను జాగ్రత్తగా వినవలెను. అది వారి మనస్సు పావనము చేయును. బాబాగారు తన మరణమును ముందుగా సూచించి, భక్తులైన రామచంద్ర, తాత్యా కోటే పాటిళ్ళ మరణమును తప్పించెను. వారికి బదులుగా తాను 1918 సం|| అక్టోబరు 15వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 2.30 గం||లకు పవిత్రమైన విజయదశమి పర్వదినాన స్వర్గస్థులైరి. దీనిని బట్టి భక్తులపైన బాబా గారికి విశేషమైన ప్రేమ, అభిమానము అని తెలియుచున్నవి.

      లక్ష్మీ బాయి అను భక్తురాలు తొందరగా తెచ్చిపెట్టిన రొట్టెకూడ ఆకలిగాయున్న కుక్కకు వేసి, బాబాగారు "కుక్క ఆకలి దీర్చుట నా ఆకలి తీర్చుట వంటిది, ఎవరైతే ఆకలితో యున్నవారికి భోజనము పెట్టెదరో వారు నాకు అన్నము పెట్టినట్లు" దీనినే గొప్ప నీతిగా ఎరుగుము. దీనిని బట్టి బాబా సర్వజీవులందు గలడని తెలుసుకొనుము. బాబా సర్వ వ్యాపి, చావు-పుట్టుకలు లేనివాడు. అమరులు. యోగులు శరీరము ధరించి ఏదో పనిమీద భూలోకమునకు వత్తురు. అది నెరవేరిన పిమ్మట వారెంత నెమ్మదిగాను, సులభముగాను అవతరించెదరో అంత శాంతముగా వెళ్ళెదరు.

43, 44వ అధ్యాయములు:


బాబా సమాధి పొందుటకు తరువాయి భాగము:


      ఎవరైతే ప్రపంచ విషయములందు మనస్సును మరలించి చనిపోవుటకు ముందు భగవత్ విషయములయందు లీనమొనరించినచో మరణించువారు పరమును సహజముగాను, సులభముగాను పొందుదురు. బాబా భగవంతుని అవతారమైన యప్పటికి మానవ రూపములో యుండుటవలన యితరులకు ఆదర్శముగా ఉండుటకు తాను సమాధి స్థితికి చేరుముందు వజ్ అను భక్తుని పిలిచి "రామవిజయము" అను గ్రంథమును ౧౪ దినములు పారాయణము గావించిరి.


      చనిపోయిన పిదప కూడా బాబా గారు శ్యామాకు మేనమామ అగు లక్ష్మణ్‍మామాజోషీకి స్వప్నములో గాన్పించి "భక్తులు నేను మరణించేననుకొను చున్నారు. నీవు పూజ చేసి కాకడ హారతిని యిమ్ము" అని ఆదేశించారు.
  

      మరణించి 36 గంటలు అయినప్పటికినీ బాబా గారి శరీరము గాలి పట్టి బిగిసిపోలేదు. అవయవములన్నియు సాగుచుండెను. వారి కఫినీ చింపకుండ సులభముగా తీయగల్గిరి. బాబా భౌతిక శరీరము విడచుటకు కొన్ని దినముల ముందు తాను నిత్యము తోడు-నీడగా భావించి ఆత్మానుసంధానము చేయు యిటుక ఒక బాలుని వలన జారి క్రిందపడి రెండు ముక్కలాయెను. అప్పుడు బాబా గారు మిగుల చింతించి యిట్లనిరి. "ఇటుకకాదు, నా అదృష్టమే ముక్కలు ముక్కలుగా విరిగి పోయినది. నా జీవితమునందు నాకు ఎంత ప్రేమో, దానియందు నాకంత ప్రేమ. ఈ రోజు అది నన్ను విడిచినది". ఇటుక విరుగుటకు పూర్వము 32 సంవత్సరముల క్రిందట, అనగా 1886 వ సంవత్సరములో, బాబా గారు 72 గంటలు సమాధి స్థితిలో ఉండి, పిదప ప్రాణముతో లేచెను. దీనిని బట్టి చదువరులు ఆలోచించవలసిన విషయము ఏమన బాబా ౩ మూరల శరీరమా, లేక లోపలయున్న ఆత్మయా!

అమృతతుల్యమగు పలుకులు:

      బాబా "ఎవరైతే నన్ను ఎక్కువగా ప్రేమించెదరో, వారెల్లప్పుడు నన్ను దర్శింతురు. ఎవరైతే నాకర్పించనిదే ఏమియు తినరో, అట్టి వారిపై నేను ఆధారపడియుందును. నీవు గర్వము, అహంకారము లేశమైన లేకుండ నీ హృదయములో నున్న నన్ను సర్వశ్య శరణాగతి వేడవలెను. అట్లు ఎవరు చేయుదురో వారికి మోక్షమునిచ్చి, వారి ఋణము తీర్చుకుందును. నీలోనే గాక, అన్నిటిలోను నన్ను చూడుము. దీనిని అభ్యసించినచో సర్వవ్యాపకత్వము అనుభవించి నాలో ఐక్యము పొందెదవు. ఎవరైతే యితరులను నిందించెదరో వారు నన్ను హింసించినంత వారగుదురు. ఎవరైతే బాధలను అనుభవించెదరో, ఓర్చుకుందురో వారు నాకు ప్రీతిగూర్చెదరు".

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కి జై!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి