27, డిసెంబర్ 2010, సోమవారం

శ్రీ సాయి సచ్చరిత్ర సారాంశము - సోమవారము పారాయణము



శ్రీ సాయి సచ్చరిత్ర సారాంశము  
(సోమవారము పారాయణము) 
మూలము: శ్రీ హేమాదు పంత్ చే రచింపబడి షిరిడీ సంస్థానము వారిచే ముద్రింపబడిన శ్రీ సాయి సచ్చరిత్రము నుండి.
క్లుప్తీకరణ: సి.హెచ్.కె.సూర్య ప్రకాశ రావు 
సాయి భక్తుడు 

 31 వ అధ్యాయము:

    మరణకాలమందు మనస్సునందున్న కోరిక గాని, ఆలోచనగాని ఆ వ్యక్తి భవిష్యత్తును నిర్నయించును. భగవద్గీత 8వ అధ్యాయం, 5,6 శ్లోకములలో శ్రీకృష్ణుడిట్లు చెప్పియున్నారు. "ఎవరైతే వాని అంత్యదశయందు నన్ను జ్ఞప్తియందుంచుకుందురో వారు నన్ను చేరెదరు". "ఎవరో ఏదో మరొక దానిని ధ్యానింతురో వారు దానిని పొందుదురు". యోగులకు పాదములకడ వినమ్రులై ప్రాణములు విడుచువారు రక్షింపబడుదురు. వారెంతో పుణ్యము చేయనిదే వారికట్టి సద్గతి కలుగదు.

32 వ అధ్యాయము:

    ఒకడెంత పండితుడైనప్పటికి, వేదవేదాంగములు బాగుగా చదివినప్పటికిని తన గమ్య స్థానమునకు సురక్షితముగా పోలేడు. మార్గదర్శియే యుండి సహాయపడి సరియైన దారి చూపినచో మార్గములో ఉన్న గోతులనుండి, అడవి మృగములనుండి తప్పించుకొని సుగమముగా పయనించును.

    పుస్తక జ్ఞానము ఎందుకు పనికిరానిది. మనకు విధింపబడిన కర్మను మనము పూర్తిచేసి తనువును, మనమును, పంచప్రాణములను గురువు పాదములపై పెట్టి శరణు వేడవలెను. గురువే దైవము. సర్వమును వ్యాపించువాడు. అట్టి ప్రత్యయము ఏర్పడుటకు దృఢమైన, అంతులేని నమ్మకము అవసరము అని బాబా అనెను. వివేకమునకు, వైరాగ్యమునకు అవతారము సాయి. ధర్మము, అర్ధము, కామము మన కృషి వలన లభించును. కాని మోక్షము గురువు సహాయము వలననే లభించును. బాబా ఎన్నడునూ ఉపవసించలేదు. ఇతరులను కూడ ఉపవాసము చేయనిచ్చువారుకాదు. ఉపవాసము చేయువాని మనస్సు స్థిమితముగా యుండదు. మొదట ఆత్మను శాంతింపజేయ వలయును.

33 వ అధ్యాయము:

ఊదీ మహిమ 1: బాబా బోధించిన విధము.

    ప్రపంచములో కనిపించు వస్తువులన్నియు బూడిదవలె అశాశ్వతములు. పంచభూతములచే చేయబడిన మన శరీరములు సర్వ సౌఖ్యములు అనుభవించిన పిమ్మట పతనమై బూడిదగును. ఈ సంగతి జ్ఞప్తికి తెచ్చుటకై బాబా భక్తులకు ఊదీ ప్రసాదమును పంచిపెట్టుచుండెను. ఈ ఊదివలన బ్రహ్మము నిత్యమనియు, ఈ జగత్తు అశాశ్వతమనియు, ప్రపంచములో గల బంధువులు (ఉదాహరణకు కొడుకుగాని, తల్లిగాని, తండ్రిగాని) మనవారు కారనియు బాబా బోధించెను. ఈ ప్రపంచములోనికి మనము ఒంటరిగా వచ్చి తిరిగి ఒంటరిగా పోయెదము. ఊది అనేక విధముల శరీర మానసిక రోగములను బాగు చేయుచుండెను. ఊది ఆరోగ్యమును, ఐశ్వర్యమును, ఆతురతల నుండి విమోచనము యొసంగుచుండెను. బాబా మొదటిదియైన ఊది వివేకమునకు, రెండవదియైన దక్షిణ వైరాగ్యమును బోధించుచుండెను. ఈ రెండును కల్గియున్నగాని సంసారమనే సాగరమును దాటలేము.

    కావును బాబా ఊదీని పొందుభాగ్యము కలవారు స్నానము చేసిన పిమ్మట ఊదీని నుదుట రాసుకొని కొంచము నీటిలో కలిపి బాబా పవిత్రమైన తీర్థముగా భావించి పుచ్చుకొనవలెను. బాబా సమాధి సమయమప్పుడు లక్ష్మీబాయి షిండేకు 9 రూపాయలు యిచ్చిరి. అవి నవవిధ భక్తులను తెలియజేయును.

34 వ అధ్యాయము:
 

ఊదీ మహిమ 2:
 

    బాబా "ఎవరైతే ఈ మసీదుకు వచ్చెదరో వారెన్నడు ఈ జన్మలో ఏ వ్యాధిచేతను బాధపడరు. ఇది మసీదుకాదు. ఇది ద్వారవతి. ఎవరైతే యిందు కాలు మోపెదరో వారు ఆరోగ్యమును, ఆనందమును పొందెదరు. వారి కష్టములు గట్టెక్కును". అని తెలిపిరి. మన కష్టసుఖములకు మన కర్మయే కారణము. అల్లాయే ఆర్తి తీర్చువాడు. వానినెల్లప్పుడును ధ్యానించుము. నీవు సర్వస్య శరణాగతి వేడుము. అటుపై వారేమి చేసెదరో చూడుము.

    కర్మ యొక్క మార్గము విచిత్రమైనది. నేను భగవంతుడనుకాను, ప్రభువును కాను. వారి నమ్మకమైన బంటును. వారినెల్లప్పుడు జ్ఞాపకము చేయుచుందును. "ఎవరైతే తమ అహంకారమును ప్రక్కకుతోసి భగవంతునికి నమస్కరించెదరో ఎవరు వారిని పూర్తిగా నమ్మెదరో వారి బంధములూడి మోక్షమును పొందెదరు" అని నుడివెను.

35 వ అద్యాయము:
 

ఊది మహిమ 3:
 

    బాబా "నేను ఒక రూపాయి దక్షిణ ఎవరివద్ద నుంచిగాని తీసుకొనినచో దానికి 10 రెట్లు యివ్వవలయును. నేను ఊరక ఏమియు తీసుకొనను. యుక్తాయుక్తములు తెలియకుండ నేనెవరిని అడుగను. ఫకీరు ఎవరిని చూపునో వారి వద్దనే నేను తీసుకొనెదను. ఎవరైన గత జన్మ నుండి బాకీ యున్నచో వారి వద్ద ధనము పుచ్చుకొందును. దక్షిణ యిచ్చుచున్నచో వైరాగ్యము పెరుగును. దానివలన భక్తి, జ్ఞానములు కల్గును.
నిద్ర పట్టని రోగులకు బాబా చెప్పినది.

      ప్రతిరోజు నిద్రించుటకు ముందు కొంచెము ఊది నుదుటికి వ్రాసికొని మిగతా పొట్లము తలక్రింద దిండునకు దిగువ పెట్టుకొనవలెను. ఒకనాడు ఒకరి యింటిలో భోజనమునకు పిలిచిన బంధువులకన్న మూడు రెట్లు బంధువులు వచ్చిరి. ఏమి చేయాలో తెలియక అత్తగారు చెప్పిన ప్రకారము కోడలు వండిన పదార్థముల మీద ఒక గుడ్డ కప్పి సాయిని ధ్యానించి కొంచము ఊది వేసెను. బంధువులందరకు భోజనము పెట్టగా యింకను చాల మిగిలిపోయెను. ఇది ఊదీ మహిమ. సాయి మహాత్మ్యము.

36 వ అధ్యాయము:

     బాబా దక్షిణ తీసుకొను విషయములో శ్యామాతో, "నీకేమియు తెలియదు. నేనెవరి వద్ద ఏమి తీసుకొనను. మసీదుమాయి బాకీను కోరును. బాకీ యున్నవాడు దక్షిణ చెల్లించి ఋణవిమోచన పొందును". బాబా ఎన్నడును భిక్షమెత్తలేదు. సరికదా. తమ భక్తులు కూడ భిక్షమెత్తుకొనుటకు ఒప్పుకొనలేదు. వారు ధనమును ప్రమాదకారిగాను, పరమును సాధించుటకు అడ్డుగాను భావించువారు.

    బాబా సర్వజ్ఞుడు అని తెలియజేయుటకు శ్యామా బుగ్గగిల్లి తనను శ్యామాకు 72 జన్మల సంబంధము తెలియజేసెను. వివాహమై 27 సంవత్సరాలైనా కూడ సంతానములేని ఒకామెకు తన ఆశీర్వాదముతో సంతానము కలుగజేసెను. దీనిని బట్టి బాబా సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి, దత్తాత్రేయస్వామి అని తెలియుచున్నది.

37 వ అధ్యాయము:

చావడి ఉత్సవము:

    సాయి భక్తులు రాత్రి పడుక్కొనేముందు ఎవరు చావడి ఉత్సవమును జ్ఞప్తికి తెచ్చుకొని మననము చేయుదురో వారికి సుఖము, సంతోషము, తృప్తి, మనశ్శాంతి, సాయి ఆశీర్వాదము కల్గును.

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కి జై!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి