26, డిసెంబర్ 2010, ఆదివారం

శ్రీ సాయి సచ్చరిత్ర సారాంశము - ఆదివారము పారాయణము


శ్రీ సాయి సచ్చరిత్ర సారాంశము  
(ఆదివారము పారాయణము) 

మూలము: శ్రీ హేమాదు పంత్ చే రచింపబడి షిరిడీ సంస్థానము వారిచే ముద్రింపబడిన శ్రీ సాయి సచ్చరిత్రము నుండి.


క్లుప్తీకరణ: సి.హెచ్.కె.సూర్య ప్రకాశ రావు 
సాయి భక్తుడు 


23 వ అధ్యాయము:

      జీవుడు త్రిగుణములకు అనగా సత్వ, రజో, తమోగుణములకు అతీతుడు. కాని మాయచేత కప్పబడి వాని నైజమగు సచ్చిదానందమును మరచుచు తాను శరీరము అనుకొనుచు అట్టి భావనతో తానే చేయువాడు, అనుభవించువాడు అని అనుకొనుచు లెక్కలేనన్ని బాధలతో చిక్కుకుని విముక్తిని గాంచలేకున్నాడు. విమోచనమునకు మార్గమొక్కటే గలదు. అది గురుని పాదములందు ప్రేమమయమగు భక్తి. మాయ అను మహాసముద్రమును దాటుటకు బాబా పాదములను హృదయములో ధ్యానించవలయును. బాబా ఎప్పుడు భగవంతుని సేవకుడనని చెప్పెడివాడు.

      శిష్యులు 3 రకములు: 1. గురువులకు ఏమి కావలెనో గుర్తించి వారు ఆజ్ఞాపించక పూర్వము దానిని నెరవేర్చువారు ఉత్తమ శిష్యులు. 2. గురువు ఆజ్ఞానుసారము ఆలసింపక అక్షరాల నెరవేర్చువారు మధ్యములు. 3. అడుగడుగున తప్పులు చేయుచు గురుని ఆజ్ఞను వాయిదా వేయువారు అధములు.

24 వ అధ్యాయము:

      మనం సద్గురుని పాదములకు అహంకారమును సమర్పించినగాని మన ప్రయత్నముందు జయము పొందము. మనం అహంకార రహితులమైనచో మనకు జయము నిశ్చయము. సాయిబాబాను పూజించుటచే యిహపర సౌకర్యములను రెంటిని పొందవచ్చును. శాంతి సౌఖ్యములను పొందెదము. పంచేంద్రియముల కంటే ముందే మనస్సు, బుద్ధి విషయానందమును అనుభవించును. అందువలన ఏదైనా తినుటకు ముందు భగవంతుని స్మరించవలయును. గురువునకు, దేవునకు ఎవరు బేధము నెంచెదరో వారు దైవమును ఎచ్చటను చూడలేరు.

      బాబా తన భక్తులకు వారి వారి ఇష్టానుసారము సేవ చేయుటకు అనుమతించుచుండెను. దీనిలో ఇతరులు జోక్యము కలుగ జేసుకొనుట బాబాకిష్టము లేదు. ఎవరైతే దగ్గరున్న వానికి ఇయ్యకుండ తిందురో వారు కుచేలునివలె దారిద్ర్యమును అనుభవించవలసి వచ్చును.

25 వ అధ్యాయము:

      భక్తునకు స్థిరమైన నమ్మకము, పూర్ణ భక్తియున్నపుడు వాని కోరికలన్నియు శీఘ్రముగా నెరవేరును.
బాబా: నేను సమాధి పొందినప్పటికిని, నా సమాధిలోంచి నా ఎముకలు మాట్లాడును. అవి మీకు ఆశను, నమ్మకమును కలిగించును. నేనే గాక నా సమాధి కూడ మాట్లాడును. కదులును. మనః పూర్వకముగా శరణుజొచ్చిన వారితో మాట్లాడును. నేను మీవద్ద ఉండనేమో అని మీరు ఆందోళన పడవద్దు. నా ఎముకలు మాట్లాడుచు మీ క్షేమమును కనుగొనుచుండును. ఎల్లప్పుడూ నన్నే జ్ఞప్తియందుంచుకొనుడు. నాయందే మనః పూర్వకముగను, హృదయపూర్వకముగను నమ్మకముంచుడు. అప్పుడే మీరు మిక్కిలి మేలు పొందెదరు.

      ఎప్పుడైనను, ఎక్కడైనను నా గురించి చింతించినచో నేను అక్కడనే ఉందును. మామిడి చెట్టుకు పూసిన పూత అంతయు పువ్వులు, కాయలు, పండ్లు అవదు. రాలిపోవును. బాబా వద్ద చేరిన వారందరూ ఆశీర్వాదము పొందలేరు. దానికి స్థిరమైన భక్తి-విశ్వాసము కావలయును. బాబా జ్యోతిష్యము అన్నా, జ్యోతిష్యుని మాటలు ప్రక్కన పెట్టేవారు.

26 వ అధ్యాయము:

      బాబా భక్తులతో "ఏమైనను కానిండు. పట్టు విడువరాదు. నీ గురునియందే ఆశ్రయము నిలుపుము. ఎల్లప్పుడూ నిలకడగా యుండుము. ఎప్పుడూ వారి ధ్యానమునందే మునిగి యుండుము" అని ఉపదేశించెను. "ఎవరైకైతే నమ్మకము, ఓపిక గలదో వారిని తప్పక భగవంతుడు రక్షించును. దేవునివలె యోగీశ్వరులు కూడ తమ భక్తులపై ఆధారపడెదరు. ఏ భక్తుడు హృదయపూర్వకముగను, మనః పూర్వకముగను పూజించి శరణువేడునో వానికే భగవంతుడు తోడ్పడును".

      బాబా అంబేద్కర్ అను భక్తునితో "గతజన్మ పాప పుణ్యములను నీవు అనుభవించక తీరదు. నీ అనుభవము పూర్తి కాకున్నచో ప్రాణత్యాగము నీకు తోడ్పడదు. నీవు ఇంకొక జన్మ ఎత్తి బాధ అనుభవించవలయును. చచ్చుటకు ముందు కొంతకాలమేల నీ కర్మ అనుభవించరాదు. గతజన్మముల పాపములనేల తుడిచివేయరాదు. దానిని శాశ్వతముగా పోవునట్లు చేయుము".

27 వ అధ్యాయము:

      బాబా కోరికలను నెరవేర్చు కల్పతరువు. జ్ఞానమునకు సముద్రము వంటివారు. ఆత్మ సాక్షాత్కారమునకు దారి చూపు గురువు శ్రీసాయి. సర్వజీవులయందును భగవంతుని చూచునట్లు చేయగల యోగీశ్వరుడు. ఎవరికేది ముఖ్యమో గ్రహించి అటువంటి గ్రంధములు భక్తులకు, శిష్యులకు యిచ్చి వారిచేత పారాయణ చేయించు పూజ్యులు.

28 వ అధ్యాయము:

      బాబా సర్వాంతర్యామి. సాధారణముగా తండ్రి శరీరమును పుట్టించును. పిమ్మట చావు జీవితమును వెంబడించును. కాని సద్గురువు చావు, పుట్టుకలను రెంటిని దాటించును. కాబట్టి వారు అందరికంటె దయార్ద్ర హృదయులు. బాబా "నా మనుష్యులు ఎంతదూరమున ఉన్నప్పటికీ పిచ్చుక కాళ్లకు దారము కట్టి ఈడ్చినటుల అతనిని షిరిడీకి లాగెదను". "ప్రవేశించుటకు నాకు వాకిలి అవసరములేదు. నాకు రూపము లేదు. నేను అన్ని చోట్ల నివసించుచున్నాను. ఎవరైతే నన్నే నమ్మి, నా ధ్యానమునందే మునిగియుందురో వారి పనులన్నియు సూత్రధారినై నేనే నడిపించెదను".

      భగవంతుని దర్శనమునకు గాని, పండుగరోజు గడుపుటకు గాని, తీర్థయాత్ర పోవుటకుగాని అప్పు చేయరాదని బాబా అభిప్రాయము. మేఘశ్యాముడను నిజ భక్తుడు ఒక దినము బాబాకు తలంటుస్నానము చేయతలంపుతో హరేగంగ, హరేగంగ అనుచు తలపై, శరీరముపై నీళ్ళు పోయగా, తలయే తడిసెను. శరీరము పొడిగాయుండెను. అక్కడ భక్తులు ఆశ్చర్యచకితులైరి.

29 వ అధ్యాయము:

      ఎవరికేది క్షేమమో బాబాకే తెలియును. సంశయములు, కష్టములు మన భక్తిని స్థిరపరచుటకు మనలను చుట్టుముట్టును. మనలను పరీక్షించును. పూర్తి విశ్వాసముతో బాబాను కొలుచుచు మన కృషిని సాగించినచో మన ప్రయత్నములన్నియు తుదకు విజయవంతమగును.

30 వ అధ్యాయము:

      బాబా నిర్గుణ స్వరూపులు అయినను భక్తులు కోరుటచే సగుణ స్వరూపము వహించిరి. ఇతరులు మనలను విడిచి పెట్టినప్పటికిని సాయి మాత్రము మనలను విడువడు. వారి కృపకు పాత్రులైనవారు కావలసినంత శక్తి, జ్ఞానము, నిత్యానిత్య వివేకములను పొందెదరు. భక్తుల కోర్కెలను పూర్తిగా గ్రహించి సాయి వానిని నెరవేర్చును. యోగి దర్శనమునకై భక్తుడు ఎంత వేదన పడునో, ఎంత భక్తి విశ్వాసములు చూపునో అంత త్వరగాను, బలముగాను అతని కోరిక నెరవేరును.

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి